
నిరసన ర్యాలీ
సిరుగుప్ప: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయిపై బూటు విసిరిన న్యాయవాది రాకేశ్ కుమార్‌ను తక్షణమే దేశద్రోహ చట్టం కింద బంధించాలని దళిత సంఘర్ష సమితి నాయకులు, కార్యకర్తలు, దళిత సంఘాలు గురువారం నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. తరువాత అధికారులకు వినతిపత్రం అందజేశారు.
కాలుష్యాన్ని నివారించాలి
హొసపేటె: దేశచరిత్రలో ఇందిరాగాంధీ అత్యంత ప్రభావవంతమైన, శక్తివంతమైన మహిళ అని హామీ పథకం సభ్యురాలు జ్యోతి ఎం.గొండబాళ తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి స్వర్ణోత్సవంలో భాగంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. కర్మాగారాలు చాలా కాలుష్యానికి కారణమవుతున్నాయని, ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టాలని అన్నారు. ప్రజలు వాహనాలను తక్కువగా ఉపయోగించాలని, చెత్త విషయంలో మున్సిపాల్టీతో సహకరించాలని కోరారు. మంజునాథ్ జి.గొండబాళ, సలీం అళవండి, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు బసయ్యస్వామి హిరేమట్, అక్బర్ పాషా పల్టాన్ తదితరులు పాల్గొన్నారు.
12న ఆరోగ్య పరీక్ష శిబిరం
రాయచూరు రూరల్: నగరంలో ఈ నెల 12న ఉచిత ఆరోగ్య పరీక్ష శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రముఖ వైద్యురాలు బీ.అనిత వెల్లడించారు. గురువారం పాత్రికేయులతో ఆమె మాట్లాడారు. నగరంలోని మంత్రాలయం రోడ్డులో ఉన్న ఆస్పత్రిలో మహిళలకు సంబంధించిన వ్యాధులపై పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశామని, అవసరమైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రసవ పూర్వానికి గర్భ చికిత్సలు, బాలికలకు పీరియడ్స్ వంటి అంశాలపై సలహా సూచనలిస్తారన్నారు.
అక్రమ సిలిండర్ల స్వాధీనం
రాయచూరు రూరల్: నగరంలోని ఇళ్లలో అక్రమంగా నిల్వ ఉంచుకున్న సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం మక్తల్ పేటలో నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ బసవరాజ్ దాడి జరిపి వంటకు వినియోగించే గ్యాస్ సిలిండర్లను ఆటోలకు ఇంధనం(గ్యాస్)గా వినియోగిస్తున్నట్లు సమాచారం సేకరించి దాడులు చేసి 4 సిలిండర్లను స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
స్థానిక ఎన్నికలు
త్వరగా నిర్వహించాలి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం త్వరగా జెడ్పీ, టీపీ, జీపీ ఎన్నికలను నిర్వహించాలని గ్రామ పంచాయతీ అధ్యక్షుడు రవిగౌడ ఒత్తిడి చేశారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సభ్యులు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.2.962 కోట్ల నిధులు తిరిగి వాపస్ వెళుతున్నట్లు తెలిపారు. వచ్చే డిసెంబర్ నెలలో ప్రస్తుతం అధికారంలో ఉన్న గ్రామ పంచాయతీ సభ్యుల పదవీ కాలం ముగిసి పోతుందన్నారు. జిల్లా పంచాయతీ, తాలూకా పంచాయతీల్లో గత నాలుగేళ్ల నుంచి అధికారుల పాలన కొనసాగుతుండడంతో నిధులు ఏ రంగానికి వ్యయం చేయాలో విదితం కావడం లేదన్నారు.
విషద్రావకం సేవించి
కార్మికుడు ఆత్మహత్య
కెలమంగలం: కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నొప్పులను భరించలేక జీవితంపై విరక్తి చెంది విషద్రావకం సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయకోట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల మేరకు.. రాయకోట సమీపంలోని ఏరిచిన్నగానంపట్టి గ్రామానికి చెందిన మల్లప్ప (57) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చాడు. ఈ నేపథ్యంలో నొప్పులు తట్టుకోలేక విషద్రావకం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై రాయకోట పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

నిరసన ర్యాలీ

నిరసన ర్యాలీ

నిరసన ర్యాలీ