
హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేయాలి
హొసపేటె: ధర్మస్థలలో సౌజన్యపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో 13 ఏళ్లు గడిచినా ప్రభుత్వం నిందితులను అరెస్టు చేయడంలో విఫలమైందని ధర్మస్థల దౌర్జన్య వ్యతిరేక వేదిక నేత యల్లాలింగ ఆరోపించారు. గురువారం నగరంలో సౌజన్య హత్య కేసు దర్యాప్తులో జాప్యంపై చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. సౌజన్య హత్య కేసును పూర్తిగా తిరిగి దర్యాప్తు చేయాలన్నారు. ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు వైద్య, పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 20 ఏళ్లుగా ధర్మస్థల, చుట్టు పక్కల జరిగిన అసహజ మరణాలు, అత్యాచార, అదృశ్య, భూ కుంభకోణ, ఆర్థిక నేరాల కేసులను నిష్పాక్షికంగా దర్యాప్తు చేయడానికి సిట్‌కు అధికారం ఇవ్వాలని తెలిపారు. దళితులు, మహిళలు, దోపిడీకి గురైన వర్గాల హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్యకర్తలపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం వినతిపత్రాన్ని తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు. వేదిక నేతలు భాస్కర్‌రెడ్డి, కరుణానిధి, నాగరత్న తదితరులు పాల్గొన్నారు.
హత్యాచారంపై విచారణకు డిమాండ్
రాయచూరు రూరల్: 13 ఏళ్ల క్రితం ధర్మస్థలలో సౌజన్యపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసును సమగ్రంగా విచారించాలని ధర్మస్థల దౌర్జన్య వేదిక డిమాండ్ చేసింది. గురువారం నగరసభ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షురాలు పద్మ మాట్లాడారు. సౌజన్యపై అత్యాచారం, హత్య కేసుపై ప్రత్యేకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమగ్రంగా విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ స్థానికాధికారి ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు.

హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేయాలి