
అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయండి
బళ్లారిటౌన్: నగరంలో గత రెండు మూడేళ్లుగా వివిధ అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని బళ్లారి నాగరిక పోరాట సమితి డిమాండ్ చేసింది. బుధవారం కార్పొరేషన్ ముందు నిరసన వ్యక్తం చేసి అనంతరం కమిషనర్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సమితి కన్వీనర్ సోమశేఖర్‌గౌడ తదితరులు మాట్లాడుతూ బళ్లారి నగరంలో ఎటు చూసినా రోడ్లు గోతులమయంగా మారాయన్నారు. ఇక చాలా రోడ్ల అభివృద్ధి పనులు రెండు మూడేళ్లుగా నత్తనడకన సాగుతున్నందున వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ఇతర రోడ్లలో ట్రాఫిక్ రద్దీ పెరిగిందన్నారు. నగరంలో వీధి కుక్కలు, పశువుల బెడద వల్ల తీవ్ర ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. తాగునీటి కొళాయిల్లో డ్రైనేజీ నీరు వస్తున్నాయన్నారు. ప్రస్తుతం ఏ వార్డులో చూసినా చెత్తకుప్పలు వెలుస్తున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేతలు నాగరత్న, మంజునాథ్, శ్యాంసుందర్, గురురాజ్, వీరేష్, ఆంథోని, గురళ్లి రాజు తదితరులు పాల్గొన్నారు.