
బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడి దారుణహత్య
సాక్షి,బళ్లారి: ద్విచక్ర వాహనంలో వెళుతున్న గంగావతి తాలూకా బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడిని సినీ ఫక్కీలో వెంబడించి, స్కూటీని కారుతో ఢీకొట్టి అనంతరం మారణాయుధాలతో దారుణంగా హత్య చేసిన ఘటన జరిగింది. బుధవారం ఉదయం కొప్పళ జిల్లా గంగావతిలో తాలూకా యువమోర్చా అధ్యక్షుడు వెంకటేశ్(31) తన స్నేహితులను కలిసి దేవీనగర్ క్యాంపు నుంచి తిరిగి స్కూటీలో వస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు కారులో వచ్చి, బైక్‌ను ఢీకొట్టారు. స్కూటీ పైనుంచి కింద పడిపోయిన వెంకటేశ్‌పై మారణాయుధాలతో దాడి చేసి దారుణంగా హత్య చేసి పారిపోయారు. పాతకక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇండికా కారులో ఆరు మంది యువకులు వచ్చి మచ్చుకత్తులు, కొడవళ్లతో విచక్షణారహితంగా నరికి చంపడంతో రోడ్డు రక్తపు మడుగుగా మారింది.
పోలీసుల అధికారుల పరిశీలన
ఈ ఘటన సమాచారం తెలిసిన వెంటనే గంగావతి డీఎస్పీ సిద్దనగౌడ పాటిల్, అక్కడి సర్కిల్ ఇన్‌స్పెక్టర్, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అక్కడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా హత్య చేసిన నిందితులు వచ్చిన ఇండికా కారు గంగావతిలోని హెచ్‌ఎస్‌ఆర్ కాలనీలో దొరకడంతో పోలీసులు ఆ కోణంలో ముమ్మరంగా విచారణ చేస్తున్నారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకోవడంతో నిందితులు ఉపయోగించిన ఆయుధాలు తదితర వివరాలను సీసీ కెమెరా ఫుటేజీల్లో పరిశీలిస్తున్నారు.
ఉలిక్కిపడిన గంగావతి
ఈ హత్య ఘటన గంగావతిలో కలకలం రేపింది. గంగావతి నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ హత్య విషయం దావానలంలా వ్యాపించడంతో బీజేపీ పార్టీలోనే కాకుండా నగర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రశాంతంగా ఉన్న గంగావతిలో రాజకీయ యువ నాయకుడిని దారుణంగా హత్య చేయడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదని, అయితే పాతకక్షలతో పాటు ఇతర కారణాలను కూడా అన్వేషిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సినీ ఫక్కీలో హత్య చేసిన దుండగులు
పాతకక్షలే కారణమని అనుమానాలు?