
ఏడీ కార్యాలయం.. సేవలు దూరం
రాయచూరు రూరల్: జిల్లాలోని దేవదుర్గ తాలూకా భూ దాఖలాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ) కార్యాలయంలో కుర్చీలు ఎల్లవేళలా ఖాళీగా ఉంటాయి. అధికారులు, ఉద్యోగులు ఉదయం విధులకు డుమ్మా కొడుతూ సాయంత్రం వేళ హాజరు కావడంపై రైతులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి రైతులు తాలూకా భూ దాఖలాల కార్యాలయాలకు వచ్చి చేరేలోగా అధికారులు, ఉద్యోగులు కుర్చీలు ఖాళీ చేసి బయటకు వెళ్లిపోతారు. వందలాది రూపాయలు ఖర్చు పెట్టి వచ్చిన రైతులకు నిరాశే మిగులుతోంది. భూములను కొలిచేందుకు, రికార్డులను సరి చూడడానికి, సర్వే చేయడానికి అధికారులు, ఉద్యోగులు రైతులను వేధించడాన్ని తప్పుబడుతున్నారు. ఉదయం నుంచి విధులకు రాకుండా సాయంత్రం 6 గంటలకు కార్యాలయాలకు హాజరు అవుతున్నారు. రైతులు సాయంత్రం 5 గంటల తర్వాత గ్రామాల వైపు పయనించడంతో కార్యాలయంలో అధికారులు, ఉద్యోగులు తమ ఇతర పనులు వైపు దృష్టి సారిస్తున్నారు. ఒక్కొక్క రైతు రూ.30 వేలు–రూ.40 వేలు ఖర్చు పెట్టుకున్నా కాగితాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉంటాయి. దేవదుర్గ తాలూకాలో దాదాపు 75 వేలకు పైగా భూములు సర్వే చేయడానికి రైతులు దరఖాస్తు చేసుకున్నా నేటికీ సర్వేకు అధికారులు, సర్వేయర్లకు ఆదేశాలు జారీ చేయక పోవడం విడ్డూరంగా ఉంది. భూముల విక్రయాలు జరిగి ఏళ్లు గడుస్తున్నా రికార్డులను సవరించడంలో అధికారులు విఫలమయ్యారని తళవారదొడ్డి రైతు నింగప్ప ఆరోపించారు.
అనాథగా దేవదుర్గ భూ దాఖలాల శాఖ
అన్నదాతలకు సర్వే పనులు కాని వైనం