
మెడికల్ సీటు సాధనే గొప్పగా భావించొద్దు
బళ్లారి రూరల్ : మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధిస్తేనే తాము అందరికంటే గొప్ప అన్న భావన ఉండకూడదని బీఎంసీఆర్‌సీ డీన్ అండ్ డైరెక్టర్ డాక్టర్ గంగాధరగౌడ తెలిపారు. బీఎంసీఆర్‌సీ ఆడిటోరియంలో బుధవారం మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎస్‌ఎస్‌ఎల్‌సీ, పీయూసీలో 98 శాతం మార్కులు సాధించొచ్చు కానీ ఎంబీబీఎస్‌లో 60 శాతం మార్కులు రావడమే మహా గొప్ప. ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రతిభ అవసరం, కాని వైద్య విద్యార్థులకు చదివింది గుర్తుపెట్టుకొనే సామర్థ్యం అవసరం అన్నారు. నిరంతరం పుస్తకాలతో కుస్తీ పట్టాల్సి వస్తుందన్నారు. ప్రిన్స్‌పాల్ డాక్టర్ మంజునాథ్ మాట్లాడుతూ వైద్యవిద్యార్థులు కేవలం చదువుపైనే మనస్సు నిలపాలి. చెడు అలవాట్లకు, వ్యసనాలకు బానిసై భవిష్యత్తును పాడు చేసుకోరాదన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను చెడు మార్గాలను అనుసరించకుండా గమనించాలన్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ ఇందుమతి, వైద్య కళాశాల అధ్యాపకులు డాక్టర్ మల్లికార్జున, డాక్టర్ భరత్, డాక్టర్ పాటిల్ తదితరులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
వ్యసనాలకు బానిస కావద్దు, చెడుమార్గాన్ని అనుసరించొద్దు
బీఎంసీఆర్‌సీ డీన్ అండ్ డైరెక్టర్ డాక్టర్ గంగాధరగౌడ పిలుపు

మెడికల్ సీటు సాధనే గొప్పగా భావించొద్దు