
కులగణనలో కమ్మ అని రాయించండి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కులగణన సమీక్షను ఈనెల 18వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో సర్వే సమయంలో కమ్మ అని రాయించాలని ప్రవాసాంధ్రుడు, కన్నడ సాహితీ ప్రియుడు, స్వామి వివేకానంద సేవా సంఘం అధ్యక్షుడు గారపాటి రామకృష్ణ తెలిపారు. ఆయన ఈమేరకు బుధవారం పాత్రికేయులకు ఓ ప్రకటన విడుదల చేశారు. కొప్పళ జిల్లా గంగావతి తాలూకా శ్రీరామనగర్‌కు చెందిన రామకృష్ణ తెలుగు ప్రజలు నివసించే ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ కులగణన సర్వేలో అధికారులకు సహకరించి కమ్మ అని రాయించాలని తెలిపారు.
బాలింతల మరణాలను అరికట్టండి
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో బాలింతల మరణాల నియంత్రణకు వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది నడుం బిగించాలని గ్రామీణ కూలి కార్మికుల సంఘం, మహిళా వేదిక సంఘాలు డిమాండ్ చేశాయి. టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో గర్భిణి మహిళ మృతదేహంతో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షురాలు విద్యా పాటిల్ మాట్లాడారు. తల్లీబిడ్డల ఆస్పత్రిలో సరైన చికిత్సలు అందించడం లేదన్నారు. తల్లీబిడ్డల ఆస్పత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. కల్యాణ కర్ణాటకలో 30 లక్షల మందికి పైగా మహిళలు రక్తహీనత, అపౌష్టికత బారిన పడ్డారన్నారు. బాలింతలకు సరైన చికిత్స అందించాలని, ఆస్పత్రుల్లో సాధారణ కాన్పులకు అవకాశం కల్పించాలన్నారు. బాలింతల మరణాల అడ్డుకట్టకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆందోళన చేపట్టారు.
చేపల వేటకెళ్లి వ్యక్తి మృతి
క్రిష్ణగిరి: చేపల వేటకెళ్లిన కూలీ నీటిలో మునిగి మృతి చెందిన ఘటన కురుబరపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల మేరకు.. క్రిష్ణగిరి సమీపంలోని కీళ్‌కరడిగురి ప్రాంతానికి చెందిన మురుగన్(35) అనే వ్యక్తి మంగళవారం అదే ప్రాంతంలోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ సమయంలో లోతైన ప్రదేశానికెళ్లిన మురుగన్ ఈత రాక నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటనపై కురుబరపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.