
కాలం చెల్లిన ఔషధాలు విక్రయిస్తే చర్యలు
రాయచూరు రూరల్: నేటి ప్రపంచంలో ప్రజలు వివిధ రోగాల బారిన పడుతున్నారు. ప్రజలకు మందుల వాడకంపై అవగాహన కల్పించాలని జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్ర బాబు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా ఆరోగ్య అధికారి కార్యాలయంలో పార్మాసిస్టులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో అధికమైన ఔషధాల వినియోగంపై వివరించారు. కాలం చెల్లిన ఔషధాలను విక్రయించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. వైద్యుల సలహా మేరకు రోగులకు మందులు, మాత్రలు ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు గణేష్, శాఖిర్, ఉదయ కిశోర్, నందిత, చంద్రశేఖరయ్య, శివకుమార్, ప్రకాష, ఈశ్వర్, బసయ్య, హజీ మలంగ, కవిత, వెంకటేష్, మురళి పాల్గొన్నారు.
మారెమ్మ దేవి ఆలయ ద్వారం ప్రారంభం
హొసపేటె: దసరా ఉత్సవాల్లో భాగంగా డ్యాం రోడ్డులోని మారెమ్మ దేవి ఆలయ ముఖద్వారాన్ని ఎమ్మెల్యే గవియప్ప కుమారుడు విరుపాక్ష బుధవారం ప్రారంభించారు. రూ.కోటి నిధులతో ముఖ ద్వారం నిర్మాణం చేపట్టామన్నారు. కార్యక్రమంలో తలవార కేరి పెద్దలు కంప్లి కనిమప్ప గుజ్జల కణిమప్ప చంద్రశేఖర్ కటిగి జంబయ్య బెలగోడ అంబన్న తళవార హనుమంత, నగర పాలక సంస్థ మాజీ అధ్యక్షుడు గుజ్జల నింగప్ప, గుజ్జల హులుగప్ప పూజారి, దురుగప్ప పాల్గొన్నారు.
ఆకట్టుకున్న కవిగోష్టి
రాయచూరురూరల్: నాడ హబ్బా దసరా ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి సాంస్కృతిక ఉత్సవాలకు నగర సభ అధ్యక్షురాలు నరసమ్మ శ్రీకారం చుట్టారు. మక్కా దర్వాజలో నగర సభ, జిల్లా పాలనా యంత్రాంగం, కన్నడ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బహుభాషా కవి గోష్టిని ప్రారంభించారు. ఈ సందర్భంగ ఆమె మాట్లాడుతూ.. మన సంస్కృతిని సంరక్షించడం మనందరి కర్తవ్యం అన్నారు. కార్యక్రమంలో నగర సభ సభ్యులు జయన్న, కమిషనర్ విజయలక్ష్మి, సత్యనారాయణ పాల్గొన్నారు.
కారు అద్దాలు ధ్వంసం చేసిన వ్యక్తి అరెస్ట్
హోసూరు: మద్యం మత్తులో కారు అద్దాలను ధ్వంసం చేసిన వ్యక్తిని హడ్కో పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల మేరకు హోసూరు కార్పొరేషన్ పరిధిలోని వసంత్ నగర్ ప్రాంతానికి చెందిన రైతు నందకుమార్, అలసనత్తం ప్రాంతానికి చెందిన సిమెంట్ వ్యాపారి కుబేరన్ మిత్రులు. మూడు రోజుల క్రితం కుబేరన్ తన మిత్రులతో కలిసి మద్యం మత్తులో నందకుమార్ ఇంటి వద్దకు వెళ్లాడు. నందకుమార్‌కు చెందిన కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు హడ్కో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కుబేరన్‌ను అరెస్ట్ చేసి, కేసు దర్యాప్తు జరుపుతున్నారు.
పెట్టుబడి పేరుతో
కుచ్చుటోపీ
● ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి నుంచి రూ.45.82 లక్షలు కొల్లగొట్టిన సైబర్ దుండగులు
హోసూరు: పెట్టుబడి పెడితే అధిక లాభం వస్తుందని ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగిని నిమ్మించి రూ.45.82 లక్షలు కొట్టేసిన సైబర్ దొంగల కోసం క్రిష్ణగిరి క్రైం బ్రాంచ్ పోలీసులు గాలిస్తున్నారు. వివరాల మేరకు జిల్లా కేంద్రం క్రిష్ణగిరికి చెందిన 58 ఏళ్ల ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి సెల్‌ఫోన్‌కు కొద్ది రోజుల క్రితం ఓ మెసేజ్ వచ్చింది. ఈ వెబ్‌సైట్ లింక్ ద్వారా పూర్తి వివరాలు నమోదు చేసుకుని పెట్టుబడి పెడితే రెండింతల లాభం వస్తుందని సైబర్ మోసగాళ్లు తెలిపారు. అధిక డబ్బు వస్తుందని ఆశపడిన ఉద్యోగి తన వద్ద ఉన్న రూ.45.82 లక్షలను వివిధ బ్యాంకు ఖాతాలకు జమ చేశాడు. రోజులు గడిచినా లాభం అందకపోవడంతో మోసపోయినట్లు గ్రహించాడు. వెంటనే క్రిష్ణగిరి క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని సైబర్ దొంగల కోసం గాలిస్తున్నారు.

కాలం చెల్లిన ఔషధాలు విక్రయిస్తే చర్యలు

కాలం చెల్లిన ఔషధాలు విక్రయిస్తే చర్యలు