
రైతుల సమస్యలపై స్పందించరా?
రాయచూరు రూరల్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాయచూరు జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. పంట పొలాల్లోకి నీరు ప్రవహించడంతో కుళ్లిపోయాయి. రైతులకు అందజేసే పరిహారంపై సర్కారు, మంత్రులు స్పందించడం లేదని విధాన పరిషత్ ప్రతిపక్ష నాయకుడు నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాయచూరు తాలూకా గుంజల్లి వద్ద వర్షాలకు దెబ్బతిన్న పత్తి పంటను పరిశీలించారు. రైతుల సమస్యలపై మంత్రులు స్పందించకపోవడాన్ని తప్పుబట్టారు. పంటలకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ పదాదికారులు వీరన గౌడ, రవీంద్ర, ఆంజనేయులు, రాఘవేంద్ర, అచ్యుత రెడ్డి పాల్గొన్నారు.
పరిహారం ప్యాకేజీ ప్రకటించాలి..
రాయచూరు రూరల్: మహరాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు కృష్ణా, బీమా నదులు పొంగాయి. కలబుర్గి, యాదగిరి, బీదర్ జిల్లాల నదీ తీర ప్రాంతాల్లో ప్రజల రక్షణ, పరిహార సమీక్షను సీఎం సిద్దరామయ్య ఆకాశంలో తిరుగుతూ చేస్తారా అని విధాన పరిషత్ ప్రతిపక్ష నాయకుడు నారాయణ స్వామి ఎద్దేవా చేశారు. బుధవారం రాయచూరులో మాజీ శాసన సభ్యుడు తిప్పరాజ్ నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రూ.3 వేల కోట్ల పరిహారం ప్యాకేజీ ప్రకటించాలన్నారు. ఈ విషయంలో కేంద్రం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించి ఆపన్న హస్తం అందించడం జరుగుతుందన్నారు. అత్యవసరంగా రాష్ట్ర సర్కార్ రూ.500 కోట్ల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో శాసన సభ్యుడు శివరాజ పాటిల్, పదాధికారులు వీరన గౌడ, రవీంద్ర, ఆంజనేయులు, రాఘవేంద్ర, అచ్యుత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.