
కాఫీ సీమలో పసిడి వేట!
సాక్షి, బెంగళూరు: పసిడి ధరలు భగ్గుమంటున్న సమయంలో కర్ణాటకలో పలుచోట్ల బంగారు ఖనిజ నిక్షేపాల ఉన్నట్లు గుర్తించారు. కాఫీ తోటలకు, ప్రకృతి సౌందర్యంతో టూరిజానికి ప్రసిద్ధిగాంచిన చిక్కమగళూరు జిల్లాలోని తరీకెరె తాలూకా పరిధిలో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి బంగారం నిక్షేపాలపై పరిశోధనలు జరిపేందుకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర అటవీ శాఖకు ఒక ప్రైవేటు కంపెనీ లేఖ రాసింది. కేంద్రం అనుమతులు జారీ చేస్తే బంగారం మైనింగ్‌కు అడుగులు పడతాయి.
10 వేల ఎకరాలలో..
తరీకెరె తాలూకాలోని హోసూరు, సింగనమనె, తుంబాడిహళ్లి, గోణిబీడు, హోన్నుహట్టి చుట్టుపక్కల ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు తెలిసింది. అక్కడ పది వేల ఎకరాల అటవీ ప్రాంతంలో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు, ప్రతి టన్ను మట్టి నుంచి 19 నుంచి 80 గ్రాముల బంగారం లభించే అవకాశం ఉందని సదరు కంపెనీ అంచనా వేసింది. అయితే 10,082 ఎకరాల ప్రాంతంలో 5,600 ఎకరాలు అటవీ ప్రాంతం పరిధిలో ఉంది. అందులో అభయారణ్యం వ్యాపించింది. 3,600 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దీంతో అడవులలో పరిశోధనలకు, తవ్వకాలకు అనుమతి కోసం కేంద్రానికి విన్నవించింది.
కేంద్రానికి వినతి
గుర్తించిన ప్రాంతంలో ఒక టన్ను మట్టిలో ఎంత బంగారం లభిస్తుందనేది నిర్ధారణకు అనేక చోట్ల డ్రిల్లింగ్ చేయాల్సి ఉంటుందని లేఖలో పేర్కొంది. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డ్రిల్లింగ్, తవ్వకాలు చేపడుతామని కేంద్రానికి హామీనిచ్చింది. సదరు ప్రాంతం భద్రా అభయారణ్యం సమీపంలో ఉండడంతో పరిశోధనకు కేంద్ర అటవీ శాఖ అనుమతిస్తుందా అనే అనుమానాలు లేకపోలేదు. ఒకవేళ అనుమతులు లభిస్తే మాత్రం తరీకెరె భవిష్యత్తులో బంగారానికి ప్రసిద్ధిగా మారే అవకాశం లేకపోలేదు. కాగా, తాలూకాలోని బిద్దకల్లప్పన గుడ్డలో బంగారం నిక్షేపాల కోసం ఇటీవల కొన్నేళ్ల క్రితం పరిశోధనలు జరిగాయని స్థానికులు తెలిపారు. అలాగే కోగమల్లప్పన బెట్టలో కొన్నేళ్ల క్రితం ప్రయోగాలు చేసినట్లు తెలిసింది. సిద్ధరహళ్లి గ్రామం వద్ద ఉన్న దూపదయ్యనమట్టిలో బ్రిటిషర్ల కాలంలో పరీక్షలు నిర్వహించారని సమాచారం.
తరీకెరెలోని
ప్రకృతి అందాలు
తరీకెరె తాలూకాలో బంగారం
నిక్షేపాలు
పరిశోధనలకు అనుమతుల కోసం
కేంద్రానికి ప్రైవేటు సంస్థ లేఖ

కాఫీ సీమలో పసిడి వేట!