
మెట్రోలో గుండె తరలింపు
యశవంతపుర: జీవన్మృతుడి నుంచి సేకరించిన గుండెను మైట్రో రైలులో సకాలంలో మరో ఆస్పత్రికి తరలించి ఓ వ్యక్తి ప్రాణాన్ని నిలబెట్టారు వైద్యులు. బెంగళూరు నగరంలోని యశవంతపుర స్వర్శ ఆస్పత్రి నుంచి గురువారం రాత్రి 11.1 నిమిషాలకు జీరో ట్రాఫిక్ మధ్య అంబులెన్స్‌లో యశవంతపుర ఇండస్ట్రీయల్ మెట్రో స్టేషన్‌కు తరలించారు. అక్కడ నుంచి సంపిగె రోడ్డు మెట్రో స్టేషన్ వరకు మెట్రోలో తరలించారు. అక్కడ నుంచి శేషాద్రిపుర సమీపంలోని అపోలో ఆస్పత్రికి 11.21 నిముషాల వ్యవధిలో తరలించారు. గుండె తరలింపులో మెట్రో భద్రత సిబ్బందితోపాటు రెండు ఆస్పత్రుల వైద్య సిబ్బంది ఎంతోగాను శ్రమించారు. కాగా మెట్రోలో గుండె తరలింపు ఇది రెండో పర్యాయం.
అమెరికాలో కన్నడిగుడి హత్య
యశవంతపుర: ఆమెరికాలోని టెక్సాస్ నగరంలో కన్నడిగుడు దారుణ హత్యకు గురయ్యాడు. సహ ఉద్యోగే అతన్ని పొట్టనబెట్టుకున్నాడు. చంద్రమౌళి బాబా చెన్నమల్లయ్య అనే వ్యక్తి డల్లాస్ డౌన్‌టవ్ సూట్స్ హోటల్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. హోటల్‌ను శుభ్రం చేసే యంత్రం విషయంపై శుక్రవారం ఉదయంం సహ ఉద్యోగి యాడ్నినిస్ కోబోస్ మార్టినెజ్‌తో వాగ్వాదం జరిగింది. విచక్షణ కోల్పోయిన సహ ఉద్యోగి పదునైన ఆయుధంతో చంద్రమౌళిపై దాడి చేసి హత్య చేసి ఉడాయించాడు. ఈ దారుణం జరిగిన సమయంలో మృతుడి భార్య, పిల్లలు అక్కడే ఉన్నారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు గతంలో ఒక కేసులో జైలుకు వెళ్లి వచ్చాడని పోలీసులు తెలిపారు. హత్య దృశ్యాలు హోటల్‌లో అమర్చిన సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
బీడీసీసీ బ్యాంకు ఎన్నికల్లో గొడవ
దొడ్డబళ్లాపురం: బెళగావిలో బీడీసీసీ బ్యాంకు ఎన్నికల్లో గొడవ జరిగింది. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొని ఎన్నిక వాయిదా పడింది. శుక్రవారం కిత్తూరు పట్టణంలో బీడీసీసీ బ్యాంకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల నిర్వహణకు విచ్చేసిన పీకేపీఎస్ కార్యదర్శిని కాంగ్రెస్ నాయకులు కారులో కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు బాహాబాహీ తలపడ్డారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. ఎన్నికలు వాయిదా పడ్డాయి.
శివాజీనగర మెట్రో స్టేషన్‌కు సెయింట్ మేరీ బసిలికాగా పేరు మార్పు
శివాజీనగర: రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరానికి కేంద్ర బిందువుగా ఉన్న శివాజీనగర మెట్రో స్టేషన్‌కు శివాజీనగర సెయింట్ మేరీస్ బసిలికాగా నామకరణం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇటీవల సెయింట్ మేరీ బసిలికాలో జరిగిన వార్షిక పండుగ సమయంలో ప్రజల విన్నపం మేరకు బెంగళూరులోని శివాజీనగర మెట్రో స్టేషన్‌ను సెయింట్ మేరీ బసిలికాగా నామకరణం చేయాలని తమ ప్రభుత్వం పరిగణించనున్నట్లు తెలిపారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే రిజ్వాన్ హర్షద్ మీడియాకు వివరించారు.
మహారాష్ట్ర సీఎం వ్యతిరేకత
శివాజీనగర మెట్రో స్టేషన్ పేరు మార్పునకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తీర్మానంపై విరుచుకుపడ్డారు. ఇది ఛత్రపతి శివాజీ మహారాజుకు చేసిన అవమానమని తెలిపారు. నెహ్రూ కాలం నుంచి కూడా కాంగ్రెస్ మరాఠా రాజులను అవమానించే సంప్రదాయాన్ని కొనసాగిస్తోందని అసంతృప్తిని వ్యక్తం చేశారు.
● రాచనగరి ధగధగ
మైసూరు దసరా ఉత్సవాలకు రాచనగరి సిద్ధమవుతోంది. స్మారకాలు, ప్రముఖ సర్కిళ్లు, ప్రధాన రహదారులను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి శోభాయమానంగా తీర్చిదిద్దారు.

మెట్రోలో గుండె తరలింపు

మెట్రోలో గుండె తరలింపు