
అదుపు తప్పిన స్కూల్ బస్సు
దొడ్డబళ్లాపురం: అదుపుతప్పిన స్కూల్ బస్సు రోడ్డుపక్కకు దూసుకెళ్లడంతో 20 మంది విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు.ఈ సంఘటన బెంగళూరు పణత్తూరు బళగరె వద్ద చోటుచేసుకుంది. శుక్రవారం విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తుండగా నీరు నిలిచిన రోడ్డు గుంతను తప్పించడంలో అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి ఒక వైపు ఒరిగిపోయింది. స్థానికులు వచ్చి విద్యార్థులను బయటకు తీశారు. కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణాపాయం సంభవించలేదు.
పోతీస్ వస్త్రదుకాణాలపై ఐటీ దాడి
బనశంకరి: కోట్లాది రూపాయల వంచనకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో తమిళనాడుకు చెందిన పోతీస్ వస్త్రదుకాణాలపై ఆదాయపన్ను(ఐటీ) శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. చైన్నె నుంచి వచ్చిన 30 మందికి పైగా ఐటీ అధికారులు శుక్రవారం ఉదయం నగరంలోని కే.జీ.రోడ్డులోని పోతీస్‌తో పాటు అనేక వస్త్రదుకాణాలపై ఐటీ అధికారులు దాడి చేసి ట్యాక్స్ వంచన కేసుకు సంబంధించిన ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని వస్త్రదుకాణాలు తెరవక పోవడంతో ఐటీ అధికారులు ఫోన్ చేసి సమాచారం అందించి బలవంతంగా దుకాణాల తాళాలు తీసి పరిశీలించారు. మైసూరు రోడ్డులోని టింబర్ లేఔట్, గాంధీనగరలో అతి పెద్ద షోరూమ్‌పై దాడి చేశారు. టింబర్ లేఔట్‌లోని పోతీస్ దుకాణంపై 25 మందికి పైగా ఐటీ అధికారులు దాడి చేసి నగదు, ఆన్‌లైన్ కార్యకలాపాలు, దుస్తుల విలువతో పాటు దుకాణంలోని అన్ని రికార్డులు, ఫైళ్లను పరిశీలించారు.