
ఖరీఫ్‌లో 98 శాతం విత్తనం పూర్తి
సాక్షి బెంగళూరు: వ్యవసాయ శాఖ అంచనాలకు అనుగుణంగా ఖరీఫ్‌లో పంటల సాగయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆశించిన మేర వర్షపాతం నమోదవుతోంది. ఈ క్రమంలో ఈ రుతుపవన వర్షాకాలంలో విత్తన నాట్ల ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. సెప్టెంబర్ మొదటి వారం ముగిసే నాటికి రాష్ట్రంలో 80.76 లక్షల హెక్టార్లలో విత్తన నాట్లు పూర్తి అయ్యాయి. అయితే యూరియా, ఎరువుల కొరత కారణంగా కొన్ని చోట్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ఖరీఫ్‌లో 82.50 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు అవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 80.76 లక్షల హెక్టార్లలో విత్తన నాట్లు పడ్డాయి. ఈ సారి మే చివరి నాటికి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. రుతుపవనాలు రాష్ట్రాన్ని పలకరించాయి. జూన్‌లో కరావళి, మలెనాడు జిల్లాల్లో మంచి వర్షపాతం నమోదైంది. అయితే పలు జిల్లాల్లో మాత్రం వర్షాలు పలకరించలేదు. ఈ నేపథ్యంలో జూన్‌లో రైతులు సాగుకు ముందడుగు వేసేందుకు జాప్యం చేశారు. విత్తననాట్లు జూన్‌లో ఆశించినమేర జరగలేదు. జూలై, ఆగస్టులో కొద్ది మొత్తంలో రాష్ట్రంలో వర్షాలు కురవడంతో రైతులు విత్తననాట్లకు ఆసక్తి కనబరిచారు.
గతేడాది ఈ సమయానికి రాష్ట్రంలో 78.73 లక్షల హెక్టార్లలో రైతులు పంటలు సాగు చేశారు. ఈసారి అంతకంటే కొంచెం అధికంగా 80.76 లక్షల హెక్టార్లలో (98 శాతం) విత్తనం వేశారు. ప్రస్తుతం వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. దీంతో కోలారు, ఇతర ప్రాంత ప్రజలు దిగుబడిపై దిగులుపడుతున్నారు. చామరాజనగరలో 70 శాతం, కొడగులో 76 శాతం, శివమొగ్గలో 84 శాతం, చిక్కబళ్లాపురలో 85 శాతం, చిక్కమగళూరులో 88 శాతం, బెంగళూరు నగర జిల్లాలో 97 శాతం మేర విత్తన నాట్లు పడ్డాయి. మిగిలిన జిల్లాల్లో 100 శాతం మేర విత్తన ప్రక్రియ పూర్తయింది.
సబ్సిడీ ధరలో విత్తనాలను కొనుగోలు చేసి రైతులు నాట్లు వేస్తున్నారు. అయితే సకాలంలో వర్షాలు రాని కారణంగా 50 శాతం పంటలు నాశనమయ్యాయి. మే నెలలో చెదురుమదురు వర్షాలు పలకరించడంతో ఉత్తర కర్ణాటకలోని పలు జిల్లాల్లో రైతులు పంటల సాగు ప్రారంభించారు. అయితే ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేయండంతో పంటలు నాశనం అయ్యాయి. తాజాగా వర్షాలు ఆశించిన మేర కంటే అధికంగా రావడంతో రైతుల్లో జోష్ పెరిగింది. విత్తన నాట్లు వేసేందుకు రైతులు మళ్లీ ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ క్రమంలో సబ్సిడీ ధరలో మరోసారి విత్తనాలను ఇవ్వాలని రైతులు మనవి చేస్తున్నారు. అయితే ఒక్కసారి సబ్సిడీ ధరలో విత్తనాలు పంపిణీ చేసిన తర్వాత తిరిగి మరోసారి ఇవ్వడం సాంకేతికంగా వీలుపడదని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
80.76 లక్షల హెక్టార్లలో సాగు ప్రారంభం
ఉత్తర కర్ణాటకలో భారీగా విత్తన ప్రక్రియ
వేధిస్తున్న ఎరువుల కొరత
లక్ష్యం 82.50 లక్షల హెక్టార్లు
గత ఏడాది ఇదే సమయానికి..
రాయితీతో విత్తనాలు, ఎరువులు

ఖరీఫ్‌లో 98 శాతం విత్తనం పూర్తి

ఖరీఫ్‌లో 98 శాతం విత్తనం పూర్తి