
అనర్హుల రేషన్ కార్డులకు మంగళం
● అధికారులకు సీఎం ఆదేశం
శివాజీనగర: రాష్ట్రంలో అనర్హులు కలిగి ఉన్న బీపీఎల్ రేషన్ కార్డులను తక్షణం రద్దు చేయాలని సీఎం సిద్దరామయ్య అధికారులను ఆదేశించారు. అయితే అర్హత కలిగిన కార్డుదారులకు ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దన్నారు. నివాస కార్యాలయం కృష్ణాలో ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి, అధికారులతో సమీక్షా సమావేశం జరిపారు. ఇప్పటికే గుర్తించిన 3,65,614 రేషన్‌కార్డులను రద్దు చేసినట్లు చెప్పారు. అన్నభాగ్య పథకం కింద బియ్యంతో పాటుగా పౌష్టిక ధాన్యం, ఆహార వస్తువులతో కూడిన కిట్ అందజేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు రేషన్ డీలర్‌షిప్‌లను పంపిణీ చేయాలన్నారు. ఆహార ధాన్యాలను తరలించే వాహనాలకు జీపీఎస్ ట్రాకర్‌లను అమర్చి నిఘా పెట్టాలన్నారు.
పురోగమనంలో ఇళ్ల నిర్మాణం
వివిధ వసతి పథకాల క్రింద నిర్మించబడుతున్న ఇళ్లను పూర్తి చేయాలని సీఎం తెలిపారు. పీఎం ఆవాస్ కింద 13,303 ఇళ్లు దాదాపుగా పూర్తయ్యాయి. 25,815 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇళ్ల లబ్ధిదారులకు అనువుగా రుణ సదుపాయాలను కల్పించాలని సూచించారు. స్లంబోర్డు కింద 42 వేల ఇళ్లు, అంబేడ్కర్ వసతి పథకం కింద 94,939 ఇళ్లను నిర్మించనున్నట్లు చెప్పారు. సమావేశంలో మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్, అధికారులు పాల్గొన్నారు.
బీదర్ వర్సిటీ స్కాం..
లోకాయుక్త దాడులు
బనశంకరి: బీదర్‌లోని పశు, మత్స్య యూనివర్శిటీలో భారీగా నిధుల స్కాం నేపథ్యంలో లోకాయుక్త అధికారులు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 69 చోట్ల దాడులు నిర్వహించారు. బీదర్ లోకాయుక్త కార్యాలయంలో బెంగళూరువాసి వెంకటరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణకు నాంది పలికారు. వర్శిటీ అధికారులు, సిబ్బంది ఆఫీసులు, నివాసాలలో తనిఖీలు నిర్వహించారు. బీదర్‌జిల్లాలో 24 చోట్ల, బెంగళూరులో 31, కొప్పళ 2, చిక్కమగళూరు జిల్లాలో 2, హాసన్, రామనగర, కోలారు, ఉడుపితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 69 చోట్ల సోదాలు నిర్వహించారు. రూ.35 కోట్ల నిధులను స్వాహా చేశారని ఫిర్యాదిదారు వెంటకరెడ్డి ఆరోపించారు. లోకాయుక్త తనిఖీలు చేయగా రూ.22 కోట్లు కై ంకర్యం చేసినట్లు వెలుగుచూసింది. యూనివర్శిటీ కంట్రోలర్ సురేశ్ సహోదరుడు మల్లికార్జున్ చిక్కమగళూరు ఇంటిలో తనిఖీలు చేశారు. లోకాయుక్త డీఎస్‌పీ తిరుమలేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
అక్రమ గనుల కేసులకు
కొత్త చట్టం ఆమోదం
బనశంకరి/ హుబ్లీ: కర్ణాటక అక్రమ గనుల కేసుల్లో ఆస్తిపాస్తులు జప్తు కోసం రూపొందించిన చట్టానికి గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ బుధవారం ఆమోదం తెలిపారు. గనుల అక్రమాల వ్యవహారంలో నిందితుల ఆస్తులను జప్తు చేయడం, వసూలు చేయడానికి సిద్దరామయ్య ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ బిల్లు ఇటీవల అసెంబ్లీలో ఆమోదం పొంది రాజ్‌భవన్‌కు వెళ్లింది.
కమిషనర్ నియామకం: మంత్రి
అక్రమ గనుల కేసుల్లో సొత్తులను, ఆస్తుల జప్తు కోసం ఓ ప్రత్యేక కమిషనర్‌ను నియమించడానికి గవర్నర్ ఆమోదం ఇచ్చారని, ఈ చట్టం 9 నుంచి అధికారికంగా అమల్లో వచ్చిందని రాష్ట్ర న్యాయ, అసెంబ్లీ మంత్రి హెచ్‌కే పాటిల్ తెలిపారు. గదగ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని మైనింగ్ రంగంలో లెక్కలేనంత సంఖ్యలో కాంట్రాక్టర్లు, రవాణదారులు, నిలువ చేసేవారు, కొనుగోలుదారులతో పాటు దళారులు ఉన్నారన్నారు. అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకోవడానికి ఈ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు.