
టెన్త్ బాలికపై ర్యాగింగ్, లైంగిక దాడి
బనశంకరి: సిలికాన్ సిటీలో దారుణ ఘటన వెలుగుచూసింది. పదో తరగతి చదివే బాలికపై పీయూసీ చదివే అబ్బాయి వికృత చర్యలకు పాల్పడి, లైంగిక దాడికి ఒడిగట్టిన ఘటన వెలుగుచూసింది. బన్నేరుఘట్టలోని ఓ ప్రైవేటు విద్యాలయం హాస్టల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. బాధిత బాలిక కొత్తగా ఈ పాఠశాల, హాస్టల్‌లో చేరింది. అయితే కొందరు విద్యార్థులు క్లాసులో తనను ర్యాగింగ్ చేస్తున్నారని వార్డెన్, ప్రిన్సిపాల్‌కు ఆమె ఫిర్యాదు చేసింది. మాపైనే ఫిర్యాదు చేస్తావా అని కొందరు టెన్త్ , పీయూసీ విద్యార్థులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు బాలికపై ఓ పీయూసీ విద్యార్థి బాలిక మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇనుప హ్యాంగర్ తో చితకబాదాడు, దుస్తులు విప్పించి నృత్యం చేయించి వికృతంగా ప్రవర్తించారు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో ఐదుమంది విద్యార్థులు, ప్రిన్సిపాల్, వార్డెన్ మీద బన్నేరుఘట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కామాంధునికి 30 ఏళ్ల జైలు
దొడ్డబళ్లాపురం: 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కామాంధునికి 30 ఏళ్ల జైలు శిక్ష,రూ.10 వేల జరిమానా విధిస్తూ బెళగావి జిల్లా చిక్కోడి కోర్టు తీర్పు చెప్పింది. చిక్కోడి తాలూకా నిప్పాణి నివాసి ఆకాశ్, ఆరేళ్ల కిందట బాలిక మీద అఘాయిత్యం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నిప్పాణి పోలీసులు దర్యాప్తు చేసి చార్జ్‌షీట్ సమర్పించారు. సెషన్స్ కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో 30 ఏళ్ల కారాగారవాసం, జరిమానా విధించింది. బాధిత బాలికకు ప్రభుత్వం రూ.4 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.
ఈడీ కస్టడీకి ఎమ్మెల్యే సతీశ్
బనశంకరి: ఇనుప ఖనిజం చోరీ, అక్రమ తరలింపు కేసులో, అక్రమ నగదు బదిలీ ఆరోపణలతో కార్వార– అంకోలా కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశ్‌సైల్ ని ఈడీ అరెస్టు చేసింది, ఆయనను బుధవారం బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి సంతోష్ గజాననభట్ ఈ నెల 12 వరకు ఈడీ కస్టడీకి ఆదేశించారు. ఉత్తరకన్నడ జిల్లా బెలేకేరి ఓడరేవులో సీబీఐ సీజ్ చేసి ఉంచిన వేలాది టన్నుల ఐరన్ ఓర్‌ను అక్రమంగా ఎగుమతి చేశారనే కేసులో సతీశ్ సైల్ కు ప్రజాప్రతినిధుల కోర్టు 7 ఏళ్లు జైలుశిక్షను విధించడం తెలిసిందే. ఆయన హైకోర్టులో అప్పీల్ చేయగా, కోర్టు శిక్షను నిలుపుదల చేయడంతో భారీ ఊరట దక్కింది. ఇంతలోనే ఈడీ రంగంలోకి దిగింది. గత నెలలో ఇళ్లలో సోదాలు చేసి రూ.13 కోట్ల విలువచేసే డబ్బు, బంగారం తదితరాలను సీజ్ చేసింది. ఈ నేపథ్యంలో బెంగళూరులోని ఈడీ ఆఫీసుకు విచారణకు పిలిచి అరెస్టు చేశారు. వీరేంద్ర పప్పి, సైల్ వంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఈడీ వరుస దాడులతో వారిలో కలవరం నెలకొంది.
నేపాల్ నుంచి
తరలిస్తాం: సీఎం
శివాజీనగర: నేపాల్‌లో రాజకీయ సంక్షోభం, అల్లర్లు పెచ్చుమీరాయి. కర్ణాటక నుంచి వెళ్లిన పర్యాటకులు, ఇతరులు అక్కడ ఇరుక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఖాట్మండ్ విమానాశ్రయంలో చిక్కుకొన్న 39 మంది కన్నడిగులను క్షేమంగా రాష్ట్రానికి తీసుకొస్తామని సీఎం సిద్దరామయ్య చెప్పారు. కన్నడిగులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.