
ఎన్‌ఆర్‌ఐ కోటా రద్దుకు డిమాండ్
హొసపేటె: రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో అందిస్తున్న ఎన్‌ఆర్‌ఐ కోటాను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కన్వీనర్ జేపీ రవికిరణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీటుకు రూ.25 లక్షల చొప్పున భారీ రుసుముతో 15 శాతం ఎన్‌ఆర్‌ఐ కోటాను ప్రవేశపెట్టాలని నిర్ణయించిందన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను ఏఐడీఎస్‌ఓ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ చర్య వైద్య కళాశాలలకు డబ్బు తెస్తుందని ప్రభుత్వం చెప్పినా వాస్తవానికి ఈ విధానంతో పేద, మధ్య తరగతి విద్యార్థుల విలువైన ప్రభుత్వ సీట్లను ధనవంతులకు వేలం వేసి ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ వైపు నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అర్హులైన, ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాల్సిన చోట ధనిక ఎన్‌ఆర్‌ఐ విద్యార్థులకు సీట్లను రిజర్వ్ చేయడం ద్వారా, వైద్యులుగా సమాజానికి సేవ చేయాలనుకునే కార్మిక, పేద, మధ్య తరగతి కుటుంబాల ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రభుత్వం అవకాశ ద్వారాలను మూసివేస్తోందన్నారు. అందువల్ల ప్రభుత్వ కళాశాలలను ప్రైవేట్ సంస్థల మాదిరిగా లాభదాయక కేంద్రాలుగా మార్చే నిర్ణయాన్ని వెంటనే విడనాడాలని ఏఐడీఎస్‌ఓ డిమాండ్ చేస్తోందన్నారు. అనంతరం తహసీల్దార్ శృతికి వినతిపత్రాన్ని అందజేశారు. సభ్యురాలు ఉమాదేవి, విద్యార్థులు ఆదిత్య, గౌతమ్, సుమ పాల్గొన్నారు.
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాలలో ఎన్‌ఆర్‌ఐ కోటాను అమలు చేయాలని నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం పాత జిల్లాధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. సంఘం అధ్యక్షుడు బసవరాజ్ మాట్లాడుతూ బెళగావి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎన్‌ఆర్‌ఐ కోటాను 10 శాతం ఇవ్వడానికి మంత్రివర్గం ితీర్మానం చేసిందన్నారు. దీని వల్ల పేద విద్యార్ధులకు అన్యాయం చేసినట్లు అవుతుందన్నారు. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఎన్‌ఆర్‌ఐ కోటాను అమలు చేశారన్నారు. రాష్ట్ర సర్కార్ ఎన్‌ఆర్‌ఐ కోటాలో నిధులు పోగు చేసుకోవడానికి ఇది ఏడవ గ్యారెంటీ అనే విషయాన్ని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రతి సీటుకు రూ.25 లక్షల చొప్పున ఫీజులున్నాయన్నారు. 15 శాతం సీట్లు ఎన్‌అర్‌ఐకి కేటాయించడంతో పేద విద్యార్థులకు సీట్లు లభించడం కష్టమనే విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వం ప్రకటించిన ఎన్‌ఆర్‌ఐ కోటాను రద్దు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు స్థానికాధికారి ద్వారా వినతి పత్రం సమర్పించారు.

ఎన్‌ఆర్‌ఐ కోటా రద్దుకు డిమాండ్