
ప్రియాంక బెయిల్‌ను రద్దు చేయాలి
హొసపేటె: నగరంలోని ప్రియాంక మహిళా పరపతి సహకార సంఘం అధ్యక్షురాలు ప్రియాంక జైన్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేసి, ఆమెను పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. మోసానికి ప్రేరణగా నిలిచిన తాయమ్మ మహిళా శక్తి సంఘ అధ్యక్షురాలిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఒత్తిడి చేసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోర్డు సభ్యుడు యూ.బసవరాజ్ మంగళవారం ప్రెస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 300 మందికి పైగా మహిళలకు రూ.కోట్లాది మేర మోసం చేసిన ప్రియాంక జైన్ బెయిల్ రద్దు చేయాలి, ఫిర్యాదుదారులకు తగిన చట్టపరమైన జీవిత రక్షణ కల్పించాలి, సబ్సిడీ రుణాల పేరుతో ముందస్తుగా ఇచ్చిన రూ.పది కోట్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలి. బాధిత మహిళలు పద్మ, వాణి, మేఘ, చైత్ర తదితరులు మాట్లాడుతూ తాయమ్మ సంస్థ అధ్యక్షురాలిని నమ్మి తాము రుణాలు తీసుకొని ప్రియాంక పరపతి సంఘానికి రూ.లక్షలాది చెల్లించామని, తమను మోసం చేశారని చెప్పారు. కవితా సింగ్‌పై ఫిర్యాదు చేయడానికి వెళితే పోలీసులు ఫిర్యాదును స్వీకరించడం లేదన్నారు. తమకు న్యాయం కావాలని వారు పేర్కొన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి ఆర్.భాస్కర్‌రెడ్డి, నాయకులు ఏ.కరుణానిధి, మరడి జంబయ్య నాయక్, ఈడిగర మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.