
కొడుకుపై డీజిల్ పోసి నిప్పు
యశవంతపుర: రోజూ మద్యం తాగి సతాయిస్తున్నాడని తల్లిదండ్రులే హంతకులుగా మారారు. కొడుకుపై డీజిల్ పోసి సజీవ దహనం చేసిన దుర్ఘటన బాగలకోట జిల్లా జమఖండి రాలూకా బిదరి గ్రామంలో జరిగింది. హతుడు అనిల్ పరప్ప కానట్టి (32), కాగా తల్లిదండ్రులు పరప్ప, శాంత, మృతుని అన్న, ఆర్మీ జవాన్ బసవరాజ కానట్టి కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అనిల్ తాగుడుకు బానిస కావడంతో పాటు ఆన్‌లైన్ బెట్టింగ్, జల్సాల కోసం రూ.20 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పుల వాళ్లు ఇంటికి వస్తూ ఉండడంతో తల్లిదండ్రులే తీర్చారు. మళ్లీ తనకు రూ. 5 లక్షలు డబ్బులు కావాలని ఒత్తిడి చేయటం ప్రారంభించాడు. లేదంటే పొలాన్ని పంచి ఇవ్వాలని గొడవ చేసేవాడు. ఆస్తిలో వాటా ఇస్తే అమ్మేస్తాడనే భయంతో తల్లిదండ్రులు తిరస్కరించారు.
కాళ్లు చేతులు కట్టేసి
ఇటీవలే సెలవు పెట్టి ఇంటికి వచ్చిన జవాన్ బసవరాజ కూడా సోదరునికి నచ్చజెప్పినా వినిపించుకోలేదు. ఆస్తి ఇవ్వాల్సిందేనని కొన్నిరోజులుగా నిత్యం తాగి వచ్చి రభస చేయసాగాడు. ఉన్మాదిగా మారి చేతికి దొరికిన వస్తువుతో దాడి చేసేవాడు, దీంతో 5వ తేదీన అనిల్‌ను తల్లిదండ్రులు, అన్న బసవరాజ కలిసి చేతులు కాళ్లు కట్టేసి చితకబాది, ఒంటిపై డీజిల్ పోసి నిప్పు పెట్టారు. ఇరుగుపొరుగు గమనించి ఆస్పత్రికి తరలించగా ఆదివారం చనిపోయాడు. సావళగి పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
సహకరించిన మరో సోదరుడు
బాగలకోట జిల్లాలో దారుణం