
నారాయణ గురుకు ఘన నివాళి
హొసపేటె: బ్రహ్మశ్రీ నారాయణ గురు ఆలోచనాపరుడు. విద్య, సమానత్వం, సామాజిక సంస్కరణల సందేశాన్ని ప్రపంచానికి వ్యాప్తి చేశారని నగర అసిస్టెంట్ కమిషనర్ పి.వివేకానంద తెలిపారు. జిల్లా పరిపాలన, జిల్లా పంచాయతీ, కన్నడ, సాంస్కృతిక శాఖ సహకారంతో ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ హాలులో నారాయణ గురు జయంతి నిర్వహించారు. తొలుత నారాయణ గురు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నగర అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ.. నారాయణ గురు సమాజంలో పాతుకుపోయిన అంటరానితనం, కుల వ్యవస్థను నిర్మూలించేందుకు కృషి చేశారని తెలిపారు. ప్రపంచంలో ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అనే సూత్రాన్ని సమర్థించారని పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు దేవాలయాల్లోకి ప్రవేశం లేనప్పుడు దేవాలయాలను నిర్మించారన్నారు. విద్యకు ప్రాముఖ్యత ఇచ్చి విద్యా సంస్థలను నిర్మించారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ నారాయణ గురు సూత్రాలు, ఆదర్శాలను తమ జీవితాల్లో స్వీకరించి అనుసరించాలని సూచించారు. కన్నడ, సాంస్కృతిక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సిద్దలింగేష్ రంగన్నవర్ మాట్లాడుతూ.. నారాయణ గురు సూత్రం ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అన్నారు. వెనుకబడిన తరగతులందరూ తాము ఒక్కటే అనే వైఖరిని పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్య ఈడిగ సంఘం జిల్లా అధ్యక్షుడు కే.చంద్రశేఖర్, నాయకుడు ఎర్రిస్వామి, ఆఫీస్ బేవర్లు, జిల్లా స్థాయి అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.