
వనమూలికల విక్రయాలపై దాడులు
కోలారు: అనుమతులు లేకుండా రోడ్ల పక్కన ఏర్పాటు చేసిన ఆయుర్వేదిక్ టెంట్లపై తాలూకా ఆరోగ్య అధికారి డాక్టర్ నారాయణ స్వామి నేతృత్వంలో అధికారులు సోమవారం దాడులు చేసి సీజ్ చేశారు. తాలూకాలోని చిక్కహసాళ గేట్, కోలారులోని పవన్ కాలేజ్ వద్ద, ఖాజికల్లహళ్లి గేట్ వద్ద, తాలూకాలోని కెందట్టి గేట్ వద్ద కొంతమంది వ్యక్తులు టెంట్లు వేసి ఔషధ మూలికల మందులు విక్రయిస్తున్నారు. వనమూలికలు విక్రయించే వారికి ఎలాంటి విద్యార్హత లేకపోయినా ఆయుర్వేద మందులు పంపిణీ చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో దాడులు నిర్వహించారు. జిల్లా ఆయుష్ అధికారి రాఘవేంద్ర శెట్టిగార్ మాట్లాడుతూ.. ఆయుర్వేద చికిత్స అందించే వారు కనీస విద్యార్హత కలిగి ఉండాలన్నారు. అయితే ఎలాంటి విద్యార్హత లేకపోయినా టెంట్లు వేసి వివిధ రోగాలకు మందులు ఇస్తామని బ్యానర్‌లు ఏర్పాటు చేశారన్నారు. దీంతో దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఎవరైనా ఆయుర్వేద, హోమియోపతి చికిత్స పొందాలనుకుంటే అధికారంగా ఉన్న చికిత్సాలయాలకు వెళ్లాలన్నారు. దాడుల్లో యునాని వైద్యురాలు డాక్టర్ గీత, తాలూకా కార్యక్రమ వ్యవస్థాపకుడు మంజునాథ్ పాల్గొన్నారు.