పెళ్లి పేరిట.. వంచన పర్వం | - | Sakshi
Sakshi News home page

పెళ్లి పేరిట.. వంచన పర్వం

Sep 8 2025 5:08 AM | Updated on Sep 8 2025 2:17 PM

పెళ్ల

పెళ్లి పేరిట.. వంచన పర్వం

బనశంకరి: వివాహ సంబంధాల పేరుతో అంతులేని మోసాలు జరుగుతున్నాయి. దానికి ఇంటర్నెట్‌లో పుట్టుకొచ్చిన మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్లు మరింత ఆజ్యం పోస్తున్నాయి. నకిలీ సమాచారం ఉంచి అమాయక యువతులు, మహిళలను మోసగించే వంచకులకు స్వర్గధామంలా మారింది. ఇటువంటి నేరాలు రాష్ట్రంలో రోజురోజుకు విస్తరిస్తున్నాయి. రాష్ట్రం మొత్తం కేసుల్లో బెంగళూరులో 60 శాతం నమోదు అవుతున్నాయి. 2021 నుంచి 2025 వరకు బెంగళూరులో 381 కేసులు వచ్చాయి. మోసగాళ్లు వైద్యులు, ఐటీ ఇంజినీర్లు, సంపన్నులం అని అందమైన ప్రొఫైల్స్‌ను ఉంచి వల వేస్తారు. తమను సంప్రదించిన యువతులకు మాయమాటలతో నమ్మించి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని వంచనకు పాల్పడుతున్నారు. కొన్నిసార్లు పెళ్లి చేసుకున్న తరువాత బండారం బయటపడుతోంది. వివిధ పోలీస్‌స్టేషన్లలో నమోదైన ఫిర్యాదులు కొన్ని కేసుల్లో రాజీ ద్వారా పోలీస్‌స్టేషన్లలో పరిష్కారమౌతున్నాయి. కానీ చాలా ఘటనల్లో బాధితులు చెప్పుకుంటే మర్యాద పోతుందని ఠాణాల వరకు రావడం లేదు. పోలీసులు, కోర్టుల చుట్టూ తిరగాలని, తమకు ఎవరూ అండగా లేరనే కారణంతో చాలామంది యువతులు ఫిర్యాదు చేయడం లేదు. దీంతో మోసగాళ్లు మరింతగా రెచ్చిపోతున్నారు.

రెండో పెళ్లికి నమోదు చేసుకుంటే..

బాగల్‌కోటె జిల్లాలో రెండో వివాహం కోసం మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్‌లో ఓ మహిళ నమోదు చేసుకుంది. నైజీరియా పౌరుడు ఆమె నుంచి రూ.5.50 లక్షలు వసూలు చేశాడు. అలీవర్‌ ఒకిచికువు అనేది మోసగాని పేరు కాగా, సత్య అమిత్‌ అనే పేరుతో వెబ్‌సైట్‌లో తన ప్రొఫైల్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. మహిళతో పరిచయం పెంచుకున్నాడు. లండన్‌లో ఉంటాను, కోటి యుఎస్‌ డాలర్లు తీసుకువచ్చాను. ఢిల్లీలో కస్టమ్స్‌ అధికారులు నా డబ్బును సీజ్‌ చేశారు. దీనిని విడిపించుకోవడానికి తక్షణం చెల్లించాలని సదరు మహిళకు కాల్‌ చేసి చెప్పాడు. అలా ఆమె నుంచి రూ.5.50 లక్షలను తన అకౌంట్‌కు జమ చేసుకున్నాడు. మహిళ ఫిర్యాదు మేరకు అతన్ని ఇటీవల ఢిల్లీలో అరెస్ట్‌చేశారు. ఇలా రాష్ట్రంలో అనేకమంది యువతులు, సీ్త్రలు వంచనకు గురి అవుతున్నారు.

విజృంభిస్తున్న మ్యాట్రిమోనియల్‌

మోసగాళ్లు

నకిలీ ప్రొఫైల్స్‌తో ఎర

చెప్పుకోలేక కుమిలిపోతున్న బాధితులు

తుమకూరులో బడా వంచకుడు

తుమకూరు: తల్లిదండ్రులు, సోదరులు లేని యువతులను పెళ్లి చేసుకుని, వారి నుంచి డబ్బులు, నగలు దొంగిలించే మోసగాళ్ల కుటుంబం గుట్టురట్టయింది. తుమకూరు జిల్లా మధుగిరి నివాసి ఎంబీ వినయ్‌, అతని తల్లిదండ్రులు బసవరాజు– శాంతికుమారి, సోదరి శోభ ఈ మోసగాళ్లు. వీరు, బసవన్న ఆలయం సమీపంలో ఐస్‌ ఫ్యాక్టరీని నడుపుతున్నారు. వారు 7 మందికి పైగా యువతులను మోసం చేసి బంగారు ఆభరణాలు, కోట్ల నగదును కొట్టేశారని ఫిర్యాదులు వచ్చాయి. కర్ణాటక, చైన్నె పోలీస్ట్‌షన్‌లలో కేసులు అయ్యాయి. ఓ ఎస్సీ మహిళను మోసం చేసిన కేసులో తుమకూరు సెషన్స్‌ కోర్టు నిందితుడు వినయ్‌కు రిమాండు విధించగా, 3 నెలలు జైల్లో ఉంచి విడుదలయ్యాడు. ఇతన్ని వరునిగా చూపించేవారు. మంచి విద్యావంతుడు, ఆస్తిపరుడని చెప్పుకుని ఒంటరి యువతులు, వితంతు మహిళలను నమ్మించేవారు. వారి నుంచి పెద్దమొత్తంలో బంగారం, డబ్బు కట్నంగా తీసుకుని ముఖం చాటేసేవారు. వినయ్‌, అతని కుటుంబంపై వివిధ జిల్లాలలో బాధితులు కేసులు పెట్టారు. తాజా ఓ బాధితురాలు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

పెళ్లి పేరిట.. వంచన పర్వం1
1/1

పెళ్లి పేరిట.. వంచన పర్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement