
సన్‌రూఫ్ సరదా.. ఆస్పత్రిపాలు
● బారియర్ తగిలి బాలునికి తీవ్రగాయాలు
యశవంతపుర: కారు సన్‌రూఫ్ నుంచి నిలబడి షికార్లు చేయడం కొందరు గొప్పగా భావిస్తారు. కానీ అందులో ప్రమాదం ఉందని ఊహించలేరు. అదే మాదిరిగా ఓ బాలుడు ఆస్పత్రిపాలయ్యాడు. నగరంలో విద్యారణ్యపురలో శనివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో జికెవికె రోడ్డులో కారు సన్‌రూఫ్ నుంచి ఓ బాలుడు నిలబడి ప్రయాణిస్తున్నాడు. భారీ వాహనాలను నియంత్రించడానికి వేసిన హైట్ రిస్ట్రిక్షన్ రాడ్ అతని తలకు తగిలింది. దీంతో కేకలు వేస్తూ కారులోకి కూలబడ్డాడు. బలమైన గాయాలు కావటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కారు వెనుక వస్తున్న ఎవరో దీనిని వీడియో తీయడంతో వైరల్ అయ్యింది. ఘటనపై సమాచారాన్ని సేకరిస్తున్నట్లు బెంగళూరు ఉత్తర విభాగం ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కారును గుర్తించిన ఆర్‌టీనగర పోలీసులు యజమానిని స్టేషన్‌కు పిలిపించి విచారించారు. పిల్లలతో కలిసి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పాడు. ఇలాంటి సన్‌రూఫ్ జాలీ రైడ్ ప్రమాదాలు నగరంలో తరచూ జరుగుతున్నాయి.