
ప్రమాద దృశ్యం
నలుగురు బాలల దుర్మరణం
చామరాజనగర వద్ద ఘోరం
మైసూరు: వేగంగా వచ్చిన కారు, స్కూటర్, లారీ ఢీకొన్న దుర్ఘటనలో వెళ్తున్న నలుగురు బాలలు దుర్మరణం చెందారు. చామరాజనగర తాలూకాలోని గాలిపుర లేఔట్‌లో ఉన్న బైపాస్ రోడ్డులో ఈ విషాద ఘటన జరిగింది.
వివరాలు.. చామరాజనగరలోని కేపీ మొహల్లాకు చెందిన మహ్మద్ రెహాన్ (14), గాలిపుర లేఔట్‌లో మెహరాన్ (13), అద్నాన్ పాష (9), ఫైసల్ (9) అనే బాలలు శనివారం సాయంత్రం స్కూటర్ మీద గాలిపుర లేఔట్ నుంచి కరివరదనాయక బెట్టకు సరదాగా వెళుతున్నారు. బైపాస్ రోడ్డును దాటుతున్న సమయంలో సత్యమంగళం వైపు నుంచి వచ్చిన కారు స్కూటర్‌ని ఢీకొట్టింది. ఈ గందరగోళంలో ఎదురుగా వస్తున్న లారీ మోపెడ్ మీద ఎక్కి కారును ఢీకొట్టింది. మధ్యలో స్కూటర్, బాలలు చిక్కుకున్నారు. ఈ దుర్ఘటనలో మెహరాన్ అక్కడే చనిపోగా, మిగతా వారు తీవ్రంగా గాయపడ్డారు, బాలలను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలో మరణించారు. ట్రాఫిక్ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. ఇప్పుడే వస్తామంటూ వెళ్లిన చిన్నారులు శవాలయ్యారని తెలిసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
బూత్ స్థాయి నుంచి ఎదగాలి: డీకే
శివాజీనగర: బూత్ స్థాయిలో నాయకులుగా ఎదిగి మీ సామర్థ్యం ప్రదర్శిస్తే రాజకీయాల్లో ముందడగు వేస్తారని కేపీసీసీ అధ్యక్షుడు, డీసీఎం డీ.కే.శివకుమార్ తెలిపారు. ఆదివారం కేపీసీసీ ఆఫీసులో యువజన కాంగ్రెస్ సమావేశం జరిగింది. డీకే మాట్లాడుతూ రామకృష్ణ హెగ్డే ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయనకు విరుద్ధంగా పోరాటం చేసినందుకు తనకు సాతనూరు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. తరువాత జడ్పీ ఎన్నికలలో పోటీ చేశాను, తనకు సంఘటితం చేసే సామర్థ్యం చాలా చక్కగా ఉండేది. యువ నాయకునిగా పార్టీని కింది స్థాయి నుంచి తీసుకొచ్చాను. ఎన్నికలకు డబ్బు ముఖ్యం కాదు. మీ సంఘటనా సామర్థ్యం ముఖ్యం. వేగంగా వెళ్లాలంటే ఒక్కడే వెళ్లాలి. మీరు నాయకుల వెనుక తిరిగితే ప్రయోజనం లేదు. మీరే నాయకులుగా ఎదగాలి అని పేర్కొన్నారు. బెంగళూరులో కొత్తగా ఐదు కార్పొరేషన్‌లను ఏర్పాటు చేసినందున సుమారు 500కు పైగా కొత్త నాయకులు సిద్ధం కానున్నారని అన్నారు.
డీసీఎం బైక్ సవారీ
శివాజీనగర: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తన పాత బైక్‌లో నగరంలో విహరించినట్లు తెలిపారు. తమ ఇంటి నుండి కేపీసీసీ కార్యాలయం వరకు తానే బైక్ నడపుకొంటూ వెళ్లానని వీడియోను ఉంచారు. ఆదివారం కూడా తీరిక లేదు, నా కాలేజీ రోజులను మళ్లీ అనుభవించేందుకు నగర వీధుల్లో బైక్ సవారీ చేశానని రాశారు. ప్రజలు ఎదుర్కొంటున్న గుంతల సమస్యలను, ఇతర సమస్యలను నేరుగా వీక్షించేందుకు ఇదొక అవకాశమన్నారు.
మా కష్టం ఎవరికి చెప్పాలి?
బెంగళూరు ప్రజలు ఈ పోస్టుపై తలోరకంగా స్పందించారు. సార్ పీణ్య వైపు ఓసారి రండి, వర్తూరు వైపు రండి, వైట్‌ఫీల్డ్ రోడ్లు ఆధ్వాన్నంగా ఉన్నాయి.. అని కొందరు కామెంట్ చేశారు. మీరు తిరిగే రోడ్లలో గుంతలు లేవు ట్రాఫిక్ సమస్య సైతం ఉండదు. మా కష్టం ఎవరికి చెప్పుకోవాలని కొందరు వాపోయారు.
ఆనేకల్‌లో ఓనం సంబరాలు
బొమ్మనహళ్లి: బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్‌లో ఆదివారం ఓనం పండుగ వేడుకలను కేరళ కుటుంబాలవారు సంప్రదాయరీతిలో నిర్వహించారు. అందరూ సంప్రదాయం ఉట్టిపడేలా కొత్త దుస్తులు ధరించి తమ ఇళ్ళలో రంగు రంగుల పూల ముగ్గులను తీర్చిదిద్దారు. రంగవల్లుల చుట్టూ దీపాలను వెలిగించి పాటలు పాడుతూ నృత్యం చేశారు. ఆనేకల్‌లో పెద్దసంఖ్యలో కేరళ కుటుంబాలు స్థిరపడ్డాయి. దీంతో ఇక్కడ ఓనం పర్వదినం ఘనంగా జరుగుతుంది.
నలుగురికి ఎమ్మెల్సీ పదవులు
శివాజీనగర: రాష్ట్ర ప్రభుత్వం కేపీసీసీ మీడియా విభాగం అధ్యక్షుడు రమేశ్‌బాబుతో పాటుగా నలుగురిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. చిక్కమగళూరువాసి డాక్టర్ ఆరతి కృష్ణ, ఎఫ్.హెచ్.జక్కప్పనవర్, మైసూరు పాత్రికేయుడు శివకుమార్, కే. రమేశ్‌బాబును పరిషత్‌కు నామినేట్ చేస్తున్నట్లు గెజెట్‌ను విడుదల చేసింది. వీరిలో మొదటి ఇద్దరు హస్తం హైకమాండ్, చివరి ఇద్దరు సీఎం సిద్దరామయ్య కోటాలో పదవులను పొందారు.