పేరుకే సూపర్‌.. వైద్యం పాపర్‌ | - | Sakshi
Sakshi News home page

పేరుకే సూపర్‌.. వైద్యం పాపర్‌

Sep 8 2025 5:08 AM | Updated on Sep 8 2025 2:17 PM

పేరుకే సూపర్‌.. వైద్యం పాపర్‌

పేరుకే సూపర్‌.. వైద్యం పాపర్‌

సాక్షి,బళ్లారి: ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 15 సంవత్సరాలకు పైగా ఆస్పత్రి నిర్మాణం మూడు అడుగులు ముందుకు, ఆరు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగిన సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు ప్రస్తుతం దాదాపుగా 95 శాతం పైగా పూర్తి కావడంతో ఎట్టకేలకు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి సేవలు నామమాత్రంగా ప్రారంభమయ్యాయి. బెంగళూరు, హైదరాబాద్‌ తదితర మహానగరాల్లో అందించే సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి సేవలు బళ్లారిలో కూడా పేదలకు ఉచితంగా అందించాలనే సంకల్పంతో 15 ఏళ్ల క్రితం తొలిసారి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అప్పటి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గాలి జనార్దనరెడ్డి, మాజీ మంత్రి శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డిల కృషితో నగరంలోని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించేందుకు దాదాపు రూ.120 కోట్లకు పైగా నిధులతో శ్రీకారం చుట్టారు. అయితే అనంతరం బీజేపీ ప్రభుత్వంలో పనులు పూర్తి కాలేదు.

కాంగ్రెస్‌ సర్కారులో ప్రారంభం కాని సేవలు

బీజేపీ ప్రభుత్వం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కూడా ఆస్పత్రి సేవలు అందుబాటులోకి రాలేదు. మళ్లీ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇలా ప్రభుత్వాలు మారినా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు పూర్తి కాలేదు. ప్రస్తుతం ఆస్పత్రి పనులు దాదాపు పూర్తి కానుండటంతో ముందుస్తుగా వారం రోజుల నుంచి బయట నుంచి వచ్చే రోగులకు పరీక్షలు ప్రారంభించారు. ప్రతి రోజు 100 మందికి పైగా రోగులు వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. ఒక్క బళ్లారి జిల్లా ప్రజలకే కాకుండా విజయనగర, కొప్పళ, రాయచూరు తదితర జిల్లాల నుంచి, పొరుగున ఉన్న ఆంఽధ్రప్రదేశ్‌లోని కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన ప్రజలు కూడా ఇక్కడ వైద్య సేవలు పొందనున్నారు. అత్యాధునిక వైద్య సేవలందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 500 పడకలతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో న్యూరాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ, పీడియాట్రిక్‌ సర్జరీ, కార్డియాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ తదితర అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి.

పట్టిపీడిస్తున్న వైద్యులు, సిబ్బంది కొరత

ఎంతో అద్భుతంగా నిర్మించిన నూతన సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో నిపుణులైన అన్ని విభాగాలకు చెందిన డాక్టర్లతో పాటు నర్సులు, డీ గ్రూపు సిబ్బంది తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పేరుకు తగ్గట్టుగా ఇక్కడ వైద్య సేవలు అందించేందుకు వీలవుతుందని వైద్యుల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం బయట రోగులకు పరీక్షలు మాత్రమే చేస్తుండటంతో మరో నాలుగు నెలల్లో పూర్తిగా చికిత్సలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ గంగాధరగౌడ తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపామన్నారు. సిబ్బంది కొరత కూడా ఉందని, సిబ్బందికి సంబంధించిన సమస్యలపై కూడా నివేదికలు అందించామన్నారు. మరో రూ.20 కోట్లతో వివిధ పనులు చేపట్టాల్సి ఉందన్నారు. పరికరాలు కూడా అవసరం ఉందని, అవి కూడా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇక్కడే ఆపరేషన్లు చేసేందుకు కూడా వీలవుతుందన్నారు.

ఆస్పత్రికి సిబ్బంది నియాయకం

ఎన్నడో మరి?

ప్రతి రోజూ 100 మందికి పైగా

రోగులకు పరీక్షలు

మరో నాలుగు నెలల్లో పూర్తి సేవలు

అందుబాటులోకి

సీఎం చేతుల మీదుగా ప్రారంభానికి సన్నాహాలు

బెంగళూరు తరహాలో అత్యాధునికంగా తీర్చిదిద్దిన సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యసేవలు నామమాత్రంగా ప్రారంభమైనప్పటికీ ఇంకా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి అయిన వెంటనే, పరికరాలు సమకూర్చిన తర్వాత ముఖ్యమంత్రి సిద్దరామయ్య చేతుల మీదుగా ఆర్భాటంగా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి సేవలు ప్రారంభించనున్నారు. అయితే పేరుగొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా నగరంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు పూర్తి చేయడంతో పాటు అందుకు సంబంధించిన సిబ్బంది నియామకంపై కూడా పాలకులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. నగరంలో విమ్స్‌ ఆస్పత్రిలో పని చేసే వైద్యులే ప్రస్తుతం ఇక్కడ సేవలు అందిస్తున్నారు. విమ్స్‌ ఆస్పత్రిలో పనిచేసే వైద్యులు ట్రామాకేర్‌, ఓపీడీ, ప్రస్తుతం సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్సలు చేయడానికి సిద్ధం అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement