
సంబరాల్లో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయడం హర్షణీయమని ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి సంచాలకుడు అంబణ్ణ అరోలి పేర్కొన్నారు. ఆదివారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద మాజీ మంత్రి ఆంజనేయ చిత్రపటానికి పూలమాల వేసి మాట్లాడారు. ఏబీసీడీ వర్గీకరణకు జస్టిస్ నాగమోహన్‌దాస్ అందించిన నివేదికపై కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి తుది నిర్ణయం ప్రకటించారన్నారు. ఈ సందర్భంగా విరుపాక్షిరాజు, అనిల్‌కుమార్, జనార్దన్‌లున్నారు.
ఆర్టీసీలో నియామకాలకు ప్రతిపాదనలు
రాయచూరు రూరల్: రాష్ట్రంలోని నాలుగు ఆర్టీసీ డివిజన్లలో ఖాళీగా ఉన్న నియామకాలకు సంబంధించి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర రవాణ శాఖ మంత్రి రామలింగారెడ్డి వెల్లడించారు. శనివారం కలబుర్గిలో విలేఖర్లతో మాట్లాడారు. ఆళందలో నూతన బస్టాండ్ నిర్మాణానికి భూమిపూజ చేశామన్నారు. నాలుగు ఆర్టీసీ డివిజన్లలో ఖాళీగా ఉన్న 2,736 మంది అధికారులు, ఉద్యోగుల నియామకాలకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిన వెంటనే నియామకాలు చేస్తామన్నారు. 2016 నుంచి 2023 వరకు నియామకాలు చేయక పోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. కళ్యాణ కర్ణాటక ప్రాంతానికి రెండేళ్లలో 1031 ఎక్స్‌ప్రెస్ బస్సులు, కేఎస్‌ఆర్టీసీకి 900, వాయువ్య కర్ణాటక విభాగానికి 700, కేకేఆర్టీసీకి 400 బస్సులను కేటాయించామన్నారు.
నమ్మ క్లినిక్ ఆస్పత్రి ప్రారంభం
హొసపేటె: నగరంలోని 2వ వార్డు 88–ముద్లాపురలో ఆదివారం నమ్మ క్లినిక్ ఆస్పత్రిని ఎమ్మెల్యే హెచ్‌ఆర్ గవియప్ప ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ ప్రభుత్వం నమ్మ క్లినిక్ ఆస్పత్రులను ప్రారంభించడంతో పేద ప్రజలకు ఎంతో అనుకూలంగా మారిందన్నారు. ఈ ఆస్పత్రిలో ఉన్న సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రస్తుత, మాజీ సభ్యులు, గ్రామంలోని సీనియర్ నాయకులు, ప్రభుత్వ నామినేటెడ్ సభ్యుడు, పార్టీ నాయకులు, యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
పీఎంఏఎస్ ఇళ్ల నిర్మాణ పనుల పరిశీలన
రాయచూరు రూరల్: నగర పరిధిలో ప్రధానమంత్రి అవాస్ పథకం కింది నిర్మాణాలు జరుగుతున్న భవన నిర్మాణాలను జిల్లా స్థాయి అధికారులు పరిశీలించారు. శనివారం సాయంత్రం చిక్కసూగురు పంచాయతీ పరిధిలోని ఏగనూరు వద్ద జిప్లస్ త్రి, ఏహెచ్‌పి 2419 ఇళ్ల నిర్మాణాల గురించి జిల్లాధికారి నితీష్ కాంట్రాక్టర్ ఈరణ్ణతో కలిసి చర్చించారు. త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి ప్రజల నివాసానికి అవకాశం కల్పించాలన్నారు. తాగు నీరు, రహదారి, మురుగు కాలువలు, విద్యుత్ స్తంభాలు, దీపాలు తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. జిల్లాధికారి వెంట ఏసీ గజానన బాళే, నగరభ కమిషనర్ జుబీన్ మహాపాత్రో, అధికారులు సంతోష్ రాణి, ఈరణ్ణ, హంపమ్మలున్నారు.
కాంట్రాక్ట్ ఉద్యోగుల
నియామక బాధ్యత తగదు
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ పద్ధతిపై వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల నియామక ప్రక్రియను సహకార సంఘానికి ఇవ్వడం తగదని కాంట్రాక్ట్ పద్దతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రాజశేఖర్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లాధికారి కార్యాలయ భవనంలో ఆందోళన చేపట్టి మాట్లాడారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నియమాలను తప్పకుండా పాటించాలన్నారు. నూతనంగా సహకార సంఘానికి ఇచ్చిన ఆదేశాలను ఉప సంహరించుకోవాలని కోరుతూ జిల్లాదికారి నితీష్‌కు వినతిపత్రం సమర్పించారు.