
బీసీల సమీక్షకు సిద్ధం కావాలి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం వెనుక బడిన వర్గాల సమీక్షను త్వరితగతిన పూర్తి చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని పురస్కరించుకొని అధికారులు సమీక్షకు సిద్ధంగా ఉండాలని జిల్లాధికారి నితీష్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లాధికారి కార్యాలయ భవనంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నియమాలను తప్పకుండా పాటించాలన్నారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తప్పవన్నారు. కుల వర్గీకరణ సమీక్షలో సాంఘీక, ఆర్థిక, విద్యా పరంగా డాటాను పొందుపరచాలన్నారు. 2024 సర్వే ప్రకారం జిల్లాలో 65 మంది మాస్టర్ ట్రైనర్లు, 150 ఇళ్లకు ఒక సర్వే అధికారి, 20 మందికి సూపర్‌వైజర్‌లను నియమించామన్నారు. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 7 వరకు సమీక్షను పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ఈశ్వర్, నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో, ఏసీ గజానన బళి, తిమ్మప్పలున్నారు.
రేషన్ కార్డుల
పంపిణీలో అక్రమాలు
● 12.68 లక్షల అనుమానాస్పద కార్డుల గుర్తింపు
హుబ్లీ: రాష్ట్రంలో రేషన్ కార్డుల్లో అర్హులు కాని 12.68 లక్షల కుటుంబాలు ఏపీఎల్, బీపీఎల్, అంత్యోదయ కార్డులను తీసుకున్నారు. చనిపోయిన వారి పేరున కూడా రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ వివరాలు ఆహార పౌర సరఫరాల శాఖ జరిపిన సమీక్షలో వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న ఎంఎన్‌సీలు జాతీయ స్థాయి ఉన్నత ఉదోగ్యాలు, ఆదాయ పన్నులు చెల్లించే వారు కూడా నియమాలను ఉల్లంఘించి శ్రీమంతులు కూడా రేషన్ కార్డులు తీసుకున్నారు. పలువురి ఫిర్యాదు మేరకు సమీక్షించిన సంబంధించిన శాఖ 12 విభాగాలలో అనర్హులైన రేషన్ కార్డుల కుటుంబాలను గుర్తించారు. తమిళనాడు, ఏపీ, ఒడిశా, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ తదితర కొన్ని రాష్ట్రాల్లో 57,864 కుటుంబాలకు కార్డులు పంపిణీ చేశారు. వీటిలో 73,859 మంది లబ్ధిదారులు ప్రతి నెల బియ్యం, గోధుమలతో పాటు ఇతర ధాన్యాలను చౌక డిపోలలో పొందుతున్నారు.
కొళాయిల్లో కలుషిత నీరు సరఫరా
రాయచూరు రూరల్: నగరంలో నగరసభ అధికారులు కొళాయిలకు కలుషిత నీటిని సరఫరా చేశారు. ఆదివారం వివిధ ప్రాంతాలకు కృష్ణా నది నీటిని సరఫరా చేశారు. కొళాయిల్లో మురుగు నీరు, వాన నీరు కలుషితం కావడంతో నురగతో కూడిన నీటిని పంపింగ్ చేశారు. ప్రజలు వేరే గత్యంతరం లేక అవే నీటిని పట్టుకున్నారు. నేరుగా నది నుంచి నీరు వదలడంతో ఒండు వచ్చింది. ప్రజలు అధికారుల పనితీరు, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు.

బీసీల సమీక్షకు సిద్ధం కావాలి