
టీబీ డ్యాం క్రస్ట్‌గేట్లను మరమ్మతు చేస్తాం
హొసపేటె: బళ్లారి, విజయనగర, కొప్పళ, రాయచూరు జిల్లాల రైతుల జీవనాడి తుంగభద్ర జలాశయం క్రస్ట్‌గేట్ల మరమ్మతుకు తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. శనివారం సాయంత్రం కొప్పళ జిల్లాలోని గిణిగేరా సమీపంలోని ఎంఎస్‌పీఎల్ ఎయిర్‌స్ట్రిప్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. తుంగభద్ర జలాశయం పాతది కావడంతో గేట్లతో కూడా సమస్య ఉందన్నారు. వర్షాలు తగ్గిన వెంటనే జలాశయం గేట్లను మరమ్మతు చేస్తామని ఆయన అన్నారు. కొప్పళ జిల్లాలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను నిర్వహిస్తామని ఆయన విలేకరుల ప్రశ్నలకు బదులిచ్చారు. కొప్పళ వార్తా శాఖకు కొత్త బస్సును ఇవ్వాలని మీడియా ప్రతినిధులు ముఖ్యమంత్రిని అభ్యర్థించగా, త్వరలో కొత్త ప్రెస్ వాహనం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
టీబీ డ్యాంపై ఏపీ సీఎంతో చర్చిస్తాం
అనంతరం ఉపముఖ్యమంత్రి డీకే.శివకుమార్ మాట్లాడుతూ తుంగభద్ర జలాశయంపై చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని సమయం కోరాను. అవకాశం లభిస్తే నవలి సమాంతర జలాశయం, ఇతర జలాశయాలను ప్రతిపాదిస్తాం అన్నారు. తుంగభద్ర గేట్ల మరమ్మతు పనులు వీలైనంత త్వరగా పూర్తవుతాయి. ప్రజలు తమతో సహకరించాలని అన్నారు. భారీ, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్, ముఖ్యమంత్రి మీడియా సలహాదారు కేవీ.ప్రభాకర్, కొప్పళ ఎంపీ కే.రాజశేఖర్ హిట్నాల్, ఎమ్మెల్యేలు కే.రాఘవేంద్ర హిట్నాల్, హెచ్‌ఆర్.గవియప్ప, మాజీ ఎంపీ కరడి సంగణ్ణ, మాజీ ఎమ్మెల్యే బసవరాజ హిట్నాల్, కొప్పళ మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షుడు అమ్జద్ పటేల్, జిల్లా హామీ పథకం అమలు అథారిటీ చైర్మన్ రెడ్డి శ్రీనివాస్, బళ్లారి రేంజ్ ఐజీపీ వర్తికా కటియార్, కొప్పళ జిల్లా కమిషనర్ డాక్టర్ సురేష్ బి.హిట్నాల్, జిల్లా ఎస్పీ డాక్టర్ రామ్ ఎల్.అరిసిద్ద, సబ్‌డివిజనల్ ఆఫీసర్ కెప్టెన్ మహేష్ మాలగిత్తి పాల్గొన్నారు.
సీఎం సిద్దరామయ్య