
ధర్మస్థల కుట్ర వెనుక కేరళ ఎంపీ?
బనశంకరి: ధర్మస్థల చుట్టుపక్కల వందలాది శవాలను పూడ్చిపెట్టారని దుష్ప్రచారం చేసిన కుట్ర వెనుక కొందరు ఎంపీలు, యూట్యూబర్లు, సామాజిక కార్యకర్తలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సిట్ అధికారులు చిన్నయ్యను అరెస్ట్ చేసి సుమారు రెండు వారాలుగా విచారిస్తున్నారు, కొందరు ప్రముఖ వ్యక్తుల హస్తం ఉన్నట్లు అతడు నోరువిప్పాడు. చిన్నయ్య మకాం పెట్టిన ఇళ్లు , అపార్టుమెంట్లలో సైతం గాలించి సమాచారం సేకరించారు. పుర్రె తీసుకొచ్చిన ముఠా.. చిన్నయ్యతో కేరళ ఎంపీని కలిసి సహాయం అడిగినట్లు విచారణలో తెలిసింది. తమిళనాడు ఎంపీ పేరు సైతం ఈ కేసులో వెలుగులోకి రాగా, తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన ప్రకటించారు. ఇప్పుడు ఓ కేరళ ఎంపీ పేరు వచ్చింది. దీంతో ఆ దిశగా సిట్ అధికారులు విచారణ సాగిస్తున్నారు.
ధర్మస్థల కేసులో ఏ ఆధారంతో తనపై ఆరోపణలు చేస్తున్నారో గంగావతి బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి సమాధానం చెప్పాలని తమిళనాడు ఎంపీ, మాజీ ఐఏఎస్ శశికాంత్ సెంథిల్ డిమాండ్ చేశారు. జనార్దనరెడ్డి పై పరువునష్టం కేసు వేయడానికి శనివారం బెంగళూరు నగర సిటీసివిల్ కోర్టుకు ఆయన వచ్చారు. మీడియాతో మాట్లాడుతూ ఏదో వాట్సాప్ మెసెజ్ చూసి మాస్టర్‌మైండ్ అని తనపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు. పదేళ్లు కర్ణాటకలో పనిచేశానంటూ జనార్దనరెడ్డిపై పలు ఆరోపణలు గుప్పించారు.
మాస్కుమ్యాన్ చిన్నయ్యకు తలపుర్రెను ఇచ్చింది వృద్ధురాలు సౌజన్యభట్ మామ విఠల్‌గౌడ అని సిట్ విచారణలో వెలుగుచూసింది. దీంతో ఏక్షణంలోనైనా విఠల్‌గౌడ ను అరెస్ట్‌చేసే అవకాశం ఉంది. విఠల్‌గౌడ, చిన్నయ్య కు పాత స్నేహం ఉంది. విఠల్ నేత్రావతి నది తీరంలో చిన్న హోటల్‌ను నడుపుతున్నాడు. ఈ కుట్రలో అతడు కూడా భాగమైనట్లు సిట్ అనుమానిస్తోంది.
నిందితుడు చిన్నయ్యకు కోర్టు జుడీషియల్ కస్టడీని విధించింది. చిన్నయ్యకు 15 రోజుల సిట్ కస్టడీ ముగియడంతో శనివారం ధర్మస్థల దగ్గర ఉండే బెళ్తంగడి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాలతో చిన్నయ్యను శివమొగ్గ కేంద్ర కారాగారానికి తరలించారు.
సిట్ విచారణలో చెప్పిన మాస్క్‌మ్యాన్
శివమొగ్గ జైలుకు చిన్నయ్య..
ఎంపీ సెంథిల్ పరువు నష్టం కేసు..
పుర్రె తెచ్చింది విఠల్‌గౌడ..

ధర్మస్థల కుట్ర వెనుక కేరళ ఎంపీ?