
డ్యాం గేట్ల మార్పుపై సర్కార్ నిర్లక్ష్యం
రాయచూరు రూరల్: తుంగభద్ర డ్యాం గేట్ల మార్పు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు చామరస మాలిపాటిల్ ఆరోిపించారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది 19వ నంబరు క్రస్ట్‌గేట్ తెగిపోవడంతో శాస్త్రవేత్తలు మిగిలిన 30 గేట్లు కూడా అధ్వాన స్థితికి చేరుకున్నందున మార్చాలని నివేదిక ఇచ్చినా సర్కార్ వారి సూచనను పెడచెవిన పెట్టిందన్నారు. 2025–26లో రబీ సీజన్‌లో వరి పంటను పండించుకోవడానికి వీలు లేకుండా పోయిందన్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య గేట్ల అమరికకు చర్యలు చేపట్టడంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారన్నారు. డ్యాంలో 30 శాతం పూడిక పేరుకుందన్నారు. డ్యాం పరిధిలో సిబ్బంది కొరత ఉందన్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్‌తో చర్చించి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. జిల్లాలో ఎరువుల కొరత అధికంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయంపై ఈనెల 8న టీబీ డ్యాం వద్ద ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు.
8న టీబీ డ్యాం వద్ద ఆందోళన