
మహిళలపై దౌర్జన్యాలు అరికట్టాలి
బళ్లారిటౌన్: మహిళలపై దౌర్జన్యాలు, అశ్లీలత, మద్యపాన దాడులకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో భాగంగా బళ్లారి నగరంలో కూడా ఏఐఎంఎస్‌ఎస్ ఆధ్వర్యంలో గురువారం జిల్లాధికారి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐఎంఎస్‌ఎస్ జిల్లాధ్యక్షురాలు ఈశ్వరి మాట్లాడుతూ నేటి సమాజంలో అశ్లీల సినిమాలు, సాహిత్యాలు, ప్రకటనలు వెబ్‌సైట్ల వల్ల యువత చెడు దారి పడుతోందన్నారు. మహిళలపై అత్యాచారాలు, దౌర్జన్యాలను నియంత్రించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గత 2024–25 సంవత్సర అవధిలో 700కు పైగా బాల్య వివాహాలు జరిగాయన్నారు. గత మూడేళ్లుగా 80 వేలకు పైగా బాల్య వివాహాలు, మైనర్ గర్భిణీ కేసులు బయట పడ్డాయని జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పేర్కొన్నారు. అనంతరం తమ వినతిపత్రాన్ని స్థానిక అధికారికి సమర్పించారు. ప్రముఖులు విద్యావతి, గిరిజ, సౌమ్య, అభిలాష, పద్మ తదితరులు పాల్గొన్నారు.