
వంతెనల నిర్మాణానికి మోక్షమెన్నడో?
రాయచూరు రూరల్ : 2021 ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు పలు వాగులపై నిర్మించిన రోడ్డు వంతెనలు తెగిపోయాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు నిత్యం నగరానికి రావడానికి పలు ఇబ్బందులకు గురవుతున్నారు. కురిసిన భారీ వర్షాలకు రాయచూరు తాలూకాలోని జంబలదిన్ని–మల్‌దొడ్డి, మాన్వి తాలూకాలోని దోతరబండి– ఉటకనూరు మధ్య భాగంలో బ్యాగవాట వద్ద వంతెన కొట్టుకొని పోయింది. ప్రజా పనుల శాఖ అధికారులు నేటి వరకు వంతెన తెగిపోయిన విషయంపై విచారించక పోవడం విడ్డూరంగా ఉంది. దోతరబండి, ఉటకనూరు, బ్యాగవాట గ్రామాల ప్రజలు వంతెనపై రాకుండా 25 కి.మీ.దూరం చుట్టూ తిరిగి మాన్వికి ప్రయాణించాల్సి వస్తోంది. పల్లెలు అభివృద్ధికి ఆమడదూరం అనడానికిి రెండు ప్రధాన సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల రహదారులు, వంతెనల మరమ్మతు పనుల పేరుతో నిధులను కాంట్రాక్టర్లు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. రాయచూరు జిల్లా మాన్వి తాలూకాలో మణ్ణూరు, జాగీర్ పన్నూర్, యడివాళల మధ్య ఉన్న ముస్టూరు వంతెన ఐదేళ్ల కిందట కురిసిన వర్షాలకు రూపు కోల్పోయి వంకర టింకరగా మారింది. ప్రజలు సంచరించే వంతెన నిర్మాణ విషయంలో చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజజు మాన్వి శాసన సభ్యుడు హంపయ్య నాయక్ అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
నిత్యం ఇబ్బందులు పడుతున్న ప్రజలు
పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు

వంతెనల నిర్మాణానికి మోక్షమెన్నడో?

వంతెనల నిర్మాణానికి మోక్షమెన్నడో?