
విద్యతో పాటు పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి
బళ్లారిటౌన్: విశ్వవిద్యాలయాల్లో చదివే విద్యార్థులు విద్యతో పాటు పరిశుభ్రత కాపాడుకోవడంపై దృష్టి సారించాలని రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ పేర్కొన్నారు. గురువారం విజయనగర శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ 13వ స్నాతకోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ స్థాయిలో విద్యా సంస్థల నిర్మాణాలకు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. యూనివర్సిటీలను శ్రేష్టమైన సంస్థలుగా చేసేందుకు లక్ష్యాన్ని ఎంచుకోవాలన్నారు. 21వ శతాబ్దంలో అవసరమైనవి డిజిటల్ సాక్షరత, కొత్త కొత్త ఆలోచనలు జాగతిక దృష్టికోణం సామాజిక బాధ్యతపై జ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద 2047 కల్లా అభివృద్ధి పొందిన భారత్‌గా యువకులు తమ ప్రతిభను చాటుకొని సమాజానికి కొత్త నాంది పలకాలన్నారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలు అందించిన సాధకులు వసుంధర భూపతి, బీ.నాగనగౌడ, ఇర్ఫాన్ రజాక్‌లను గౌరవ పట్టాలనిచ్చి సత్కరించారు. అనంతరం ప్రతిభావంత విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. న్యూఢిల్లీ అంతర్ విశ్వవిద్యాలయ వేగవర్ధక కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ అవినాష్ చంద్ర పాండే, వైస్ చాన్సలర్ ఎన్.మునిరాజు తదితరులు పాల్గొన్నారు.
గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ సూచన
సందడిగా వీఎస్కేయూ 13వ స్నాతకోత్సవం

విద్యతో పాటు పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి