
రాజ్యాంగం గురించి ఎమ్మెల్యే తెలుసుకోవాలి
మాలూరు : అంబేడ్కర్ రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని, ఈ విషయం, రాజ్యాంగం గురించి ఎమ్మెల్యే కేవై నంజేగౌడ మొదట తెలుసుకోవాలని స్వాభిమాని పార్టీ సంస్థాపక అధ్యక్షుడు హూడి విజయకుమార్ అన్నారు. గురువారం తాలూకాలోని మాస్తి గ్రామంలో యువక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గణేశోత్సవ కార్యక్రమంలో పాల్గొని వినాయకునికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం రసమంజరి కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. తాలూకాలో గత ఎన్నికలలో ప్రజలు తనకు 50 వేల ఓట్లు ఇచ్చారు. తాను చేసిన సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి తనకు అత్యధిక ఓట్లు అందించారన్నారు. ప్రజల రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తానన్నారు. ఓటమితో తాను ఇంటికే పరిమితం కాలేదన్నారు. మరింత ఉత్సాహంతో సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నానన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నానన్నారు. మాలూరు తాలూకాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలు పెచ్చుమీరి అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆరోపించారు. ఇదే సమయంలో వివిధ రంగాల్లో సాధన చేసిన వారిని అభినందించారు. కార్యక్రమంలో పార్టీ తాలూకా అధ్యక్షుడు ఆర్.ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి అంబరీష్ రెడ్డి, టీపీ మాజీ అధ్యక్షుడు మాస్తి చంద్రప్ప పాల్గొన్నారు.