
వాటర్ ఫిల్టర్ యూనిట్‌కు మరమ్మతులేవీ?
కోలారు : నగరంలోని అమ్మవారిపేట సర్కిల్ వార్డు నెంబర్–9 ఫకీర్‌వాడిలో ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ చెడిపోయి ఏళ్లు గడుస్తున్నా మరమ్మతు చేయలేదని, వెంటనే వాటర్ ఫిల్టర్ యూనిట్‌కు మరమ్మతులు చేసి ప్రజల ఉపయోగంలోకి తేవాలని అబ్దుల్ కలాం సోషల్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు సగీర్ పాషా డిమాండ్ చేశారు. ఫకీర్‌వాడిలోని మటన్ మార్కెట్ పక్కన 2018–19వ సంవత్సరంలో వాటర్ ఫిల్టర్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ కేవలం కొద్ది నెలలు మాత్రమే పని చేసి అనంతరం మూతపడింది. చెడిపోయిన వాటర్ ఫిల్టర్ యూనిట్‌ను మరమ్మతు చేయడానికి నగరసభ అధికారులు ముందుకు రాలేదు. వార్డుకంతా ఒకటే యూనిట్ ఉండడం వల్ల ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. ఈ యూనిట్‌కు మరమ్మతు చేయాలని పలుమార్లు అధికారుల దృష్టికి తెచ్చినా ఫలితం లభించలేదు. ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్, నగరసభ అధికారులు సమస్యను గుర్తించి వెంటనే మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరారు.