
కనువిందుగా శోభాయాత్ర
సాక్షి,బళ్లారి: వినాయక చవితిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన హిందూ మహాగణపతి వినాయక విగ్రహాన్ని కన్నుల పండువగా శోభాయాత్ర నిర్వహించి నిమజ్జనం చేశారు. నగరంలోని సెంటినరీ హాల్ వద్ద వారం రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన అనంతరం విశ్వ హిందూ పరిషత్, రాష్ట్ర భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఊరేగింపు అనంతరం కోలాహలంగా నిమజ్జన కార్యక్రమం పూర్తి చేశారు. నగరంలో వినాయక విగ్రహాలు మూడవ రోజు, 5వ రోజు నిమజ్జనం జరగగా, సెంటినరీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన హిందూ మహాగణపతిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉత్సవ సమితి నిర్వాహకులు ఊరేగించారు. మంగళవారం సాయంత్రం కురిసిన వర్షంలోనే భారీ జనసందోహం తరలిరావడంతో శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి గట్టి బందోబస్తు నిర్వహించారు. నగరంలోని సెంటినరీ హాల్ నుంచి రాయల్ సర్కిల్, బ్రూస్‌పేట్ పోలీస్ స్టేషన్, మోతీ సర్కిల్, తేరు వీధి తదితర ప్రధాన రహదారులలో వినాయక శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. శోభయాత్రలో మేళాలు, డప్పులు కొడుతూ సందడి చేశారు. డ్యాన్స్‌లు, నృత్యాలు చేయడంతో పాటు కాషాయ జెండాలు పట్టుకొని గణపతి ముందు ఊరేగింపులో పాల్గొన్నారు. ఊరేగింపులో మాజీ మంత్రి శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ వైఎం సతీష్, కార్పొరేటర్లు మోత్కూర్ శ్రీనివాస్, బాలా హోటల్ యజమాని పోలా రాధాకృష్ణ, వీహెచ్‌పీ, భజరంగదళ్ సభ్యులు పాల్గొన్నారు.
వర్షంలోనూ భారీగా
తరలి వచ్చిన భక్తులు
ఆకట్టుకున్న హిందూ
మహా గణపతి విగ్రహం

కనువిందుగా శోభాయాత్ర