
తుంగభద్ర మహోగ్ర రూపం
హొసపేటె: తుంగభద్ర డ్యాంకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో డ్యాం పరవళ్లు తొక్కుతోంది. డ్యాంలోకి ఇన్‌ఫ్లో పెరగడంతో డ్యాం నుంచి 24 క్రస్ట్‌గేట్ల ద్వారా శనివారం దిగువకు నీటిని విడుదల చేశారు. డ్యాం వద్ద 24 క్రస్ట్‌గేట్లను రెండున్నర అడుగుల మేర పైకెత్తి సుమారు 69 వేల క్యూసెక్కులకు పైగా నీటిని నదిలోకి వదిలారు. అధికారికంగా తెరిచిన 24 క్రస్ట్‌గేట్ల నుంచి నీరు పరవళ్లు తొక్కుతున్న దృశ్యాన్ని చూసేందుకు సందర్శకులు ఎగబడ్డారు. డ్యాం నుంచి నదికి వరద నీటిని వదిలిన నేపథ్యంలో తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా జిల్లాల యంత్రాంగాలను తుంగభద్ర బోర్డు అధికారులు హెచ్చరించారు. తుంగభద్ర నదికి ఇరు వైపులా, పరివాహక ప్రాంత లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు.
చేపల వేటకు దిగొద్దు
నదిలోకి ఎవరూ చేపల వేటకు దిగవద్దని మత్స్యకారులను ఆదేశించారు. డ్యాంకు ఎగువన నదీ పరివాహక ప్రాంతంలో మంచి వర్షాలు కురుస్తున్నందున డ్యాంలోకి భారీగా ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో ప్రస్తుతం డ్యాంలో 80 టీఎంసీల వరకు నీటిని నిల్వ ఉంచి అదనపు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాయంత్రానికి డ్యాంకు మరింత ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం ఉన్నందున నదిలోకి మరింత నీటిని విడుదల చేసే అవకాశం ఉందని తెలిసింది. తుంగభద్ర డ్యాం గరిష్ట స్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం డ్యాంలో నీటిమట్టం 1625.41 అడుగులు, నీటినిల్వ 77.84 టీఎంసీలు, ఇన్‌ఫ్లో 66 వేల పైగా క్యూసెక్కులుగా ఉందని మండలి వర్గాలు తెలిపారు.
24 గేట్ల నుంచి దిగువకు నీరు విడుదల
లోతట్టు ప్రాంత వాసులకు హెచ్చరిక