
బాధిత కుటుంబానికి పరామర్శ
రాయచూరు రూరల్: విషాహారం తిని ముగ్గురు మృతి చెందగా, నలుగురు అస్వస్థతకు గురై రాయచూరు వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజు శనివారం పరామర్శించారు. నగరంలోని రిమ్స్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిని సందర్శించిన మంత్రి బాధితుల యోగక్షేమాలపై వైద్యాధికారులతో చర్చించి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కాగా తమ పొలంలో పండించిన పంటకు క్రిమి సంహారక మందులు పిచికారీ చేసిన చిక్కుడు కాయలతో తయారు చేసిన భోజనం చేసి కడుపునొప్పి, వాంతులు, విరే చనాలతో బాధ పడుతూ రమేష్ నాయక్(38), వారి కూతుళ్లు నాగమ్మ(8), దీపా(6) మరణించిన సంగతి విదితమే. రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అస్వస్థతకు గురైన రమేష్ నాయక్ భార్య పద్మావతి, కుమారుడు కృష్ణ, కూతురు చైత్రలను మంత్రి పరామర్శించి ధైర్యంగా ఉండాలని, తమ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కారు బోల్తా.. ఇద్దరు మృతి
●బాగల్‌కోటె జిల్లాలో విషాదం
సాక్షి బళ్లారి: కారు బోల్తా పడి ఇద్దరు మృతి చెందిన ఘటన శనివారం బాగల్‌కోటె జిల్లాలో హుబ్లీ–షోలాపూర్ జాతీయ రహదారిలో జరిగింది.ప్రమాదంలో బాగల్‌కోటె తాలూకా కేసనూరు గ్రామానికి చెందిన రమేష్ హూగార్(45), అక్బర్ నబీసాబ్(33) అనే ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
కరుణించమ్మా.. నాగమ్మా.!
● నాగదేవత విగ్రహం ముందు ముస్లిం మహిళ ధ్యానం
సాక్షి, బళ్లారి/హొసపేటె: కొప్పళ నగరంలోని గవిమఠంలో మత సామరస్యాన్ని చాటి చెప్పే సంఘటన వెలుగు చూసింది. గవిమఠంలో నాగదేవత విగ్రహం ముందు ఓ ముస్లిం మహిళ ధ్యానానికి కూర్చొని అందరి దృష్టిని ఆకర్షించింది. శనివారం శ్రావణమాసం ప్రారంభం కావడంతో కొప్పళ జిల్లా యలబుర్గా తాలూకా కుదురెమోతి నివాసి బేగం హసీనా గవిమఠానికి చేరుకుని నాగదేవత విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి ధ్యానానికి కూర్చున్నారు. సుమారు ఒక గంటకు పైగా ఆమె ధ్యానం చేశారు. ఆమె ప్రతి రోజూ వచ్చి ఇలా నాగదేవత రాతి విగ్రహం ముందు కూర్చొని ధ్యానం చేస్తోంది. కొప్పళ గవిమఠం స్వామీజీ సూచనల మేరకు తాను ధ్యానం చేస్తున్నట్లు ఆమె చెప్పింది. మఠానికి తాను భక్తురాలినని, ఇక్కడ చేస్తున్న సేవా కార్యక్రమాలు, మహిమలకు ఆకర్షితురాలినయ్యానని అన్నారు.
కేకేఆర్టీసీ అధ్యక్షుడిగా నియామకం
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక రోడ్డు రవాణ సంస్థ (కేకేఆర్టీసీ) అధ్యక్షుడిగా అరుణ్ కుమార్ ఎంవై పాటిల్ నియమితులయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా అలకబూనిన శాసన సభ్యులను బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా అరుణ్ కుమార్ ఎంవై పాటిల్‌ను కేకేఆర్టీసీ అధ్యక్షుడిగా ప్రభుత్వం నియమించింది.
పోలీసు స్టేషన్‌కు
బ్యారికేడ్ల వితరణ
రాయచూరు రూరల్: ఎల్‌ఐసీ సంస్థ నుంచి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు 20 బ్యారికేడ్లను ఎల్‌ఐసీ దక్షిణ మధ్య హైదరాబాద్ జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ వితరణ చేశారు. శనివారం రాయచూరు ఎల్‌ఐసీ డివిజన్ కార్యాలయంలో అదనపు ఎస్పీ కుమారస్వామికి వాటిని అందజేశారు. ఎల్‌ఐసీ డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజర్ ప్రసాద్, బసవరాజ్, వెంకటేశ్వర రావ్, హిలాలీ, చిరంజీవి, రవి, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐ మేకా నాగరాజ్, ఎస్‌ఐ సణ్ణ ఈరణ్ణ నాయక్‌లున్నారు.
మహిళా కాంగ్రెస్‌కు కార్యదర్శి నియామకం
రాయచూరు రూరల్: రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కార్యదర్శిగా నాగవేణి పాటిల్‌ను నియమిస్తూ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సౌమ్యారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గతంలో మహిళా కాంగ్రెస్ జిల్లాధ్యక్షురాలిగా పని చేసిన అనుభవంతో ఆమెను రాష్ట్ర స్థాయిలోకి తీసుకున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో జరగనున్న జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారుల విజయానికి కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని సూచించారు.

బాధిత కుటుంబానికి పరామర్శ

బాధిత కుటుంబానికి పరామర్శ

బాధిత కుటుంబానికి పరామర్శ