
ఇక మహదాయిపై చురుగ్గా పోరాటం
హుబ్లీ: మహదాయి ట్రిబునల్ తీర్పు వెల్లడైంది. నీటి వాటాలు పంపిణీ అయ్యాయి. నీటి వినియోగ అనుమతి దిశలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ఎంపీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి తగిన చర్యలు తీసుకోవడం లేదన్న ఆగ్రహంతో ఈ నెల 31న చిటగుప్పిలోని ఆయన కార్యాలయం ఎదుట నిరంతరం ఆందోళన చేపడుతామని కళసాబండూరి, మహదాయి పోరాట సమితి అధ్యక్షుడు సిద్దన్న తేజి తెలిపారు. ఆయన మహదాయిపై పోరాటం గురించి సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి జోషి మహదాయి, కళసాబండూరి యోజనకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇప్పించాలని ఆగ్రహిస్తూ ఈనెల 31న ఈ ఆందోళన చేపడుతామన్నారు. ఉత్తర కర్ణాటక ప్రాంత తాగునీటి అవసరాల కోసం 1965 నుంచి ప్రజలు పోరాటం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పసిబిడ్డను గిల్లడం, ఆ తర్వాత వారే ఊయల ఊపి బుజ్జగించే చందంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
రైతుల సహనాన్ని పరీక్షించొద్దు
అన్నదాతల సహనాన్ని పరీక్షించకండి చివరి దశలో ఉన్నాం. అన్ని పరిణామాలకు కారణం ప్రహ్లాద్ జోషినే కారణం, ఆయన రోజుకొక ప్రకటన చేస్తున్నారు. మహదాయిపై మాట్లాడేటప్పుడు ఊరికే ఉంటున్నారు. ఎన్నికల వేళ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఉత్తర కర్ణాటక ప్రచార సందర్భంగా యోజన జారీ చేస్తామని హామీ ఇచ్చారు. అయిన ఇంకా జారీ కాలేదు. 31న పోరాటం తర్వాత ఢిల్లీలోని కార్యాలయం ఎదుట కూడా ఆందోళన చేపడుతామన్నారు. అంతేగాక రాష్ట్రపతి కార్యాలయం ఎదుట కూడా పోరాటానికి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆ కార్యాలయం ఎదుట టెంటు వేస్తామన్నారు. ఈ నెలలోనే నిర్ణయించక పోతే గడువు విధిస్తామని హెచ్చరించారు. తమ పోరాటానికి వివిధ రైతు పర సంఘాలు మద్దతు ఇచ్చాయన్నారు. మహదాయిపై వివిధ పార్టీలు పలు సార్లు అర్ధంతరంగా ఆందోళనకు స్వస్తి చెప్పాయి. మేం నిరంతరంగా పోరాడుతున్నాం. ఈ సారి తుది నిర్ణయం వెలువడే దాకా పోరాటం ఆపే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు.
31న జోషి కార్యాలయం ఎదుట
నిరంతర ఆందోళన
మహదాయి పోరాట సమితి అధ్యక్షుడు సిద్దన్న తేజి