
అంజనాద్రికి పోటెత్తిన భక్తులు
సాక్షి, బళ్లారి: ఆంజనేయస్వామి జన్మస్థానమైన అంజనాద్రికి భక్తులు భారీగా తరలి వచ్చారు. శ్రావణ మాస తొలి శనివారం కావడంతో కర్ణాటక రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి అంజనాద్రి కొండపైకి ఎక్కి శ్రీరామనామాన్ని స్మరిస్తూ భక్తిశ్రద్ధలతో ఆంజనేయస్వామిని దర్శించుకొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు అంజనాద్రి భక్తులతో కిటకిటలాడింది. అంజనాద్రికి తరలి వచ్చిన భక్తులకు కొండపైన అన్నప్రసాదాలను ఏర్పాటు చేశారు. అంజనాద్రి ఆలయానికి ఏటేటా భక్తుల సంఖ్య పెరుగుతోందని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. ముఖ్యంగా శనివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకొని పునీతులయ్యారు. అలాగే ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న హంపీ విరుపాక్షేశ్వర స్వామి ఆలయాన్ని కూడా భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. హంపీలోని విజయ విఠల ఆలయం, సాసివెకాళు గణపతి, ఉగ్రనరసింహ ఆలయం తదితర ప్రాంతాలు ఎటు చూసినా భక్త జనసందోహంతో కిటకిటలాడాయి.
కింది మెట్టు ఉంచి 575వ మెట్టు
వరకు క్యూ కట్టిన భక్తులు
ఆలయంలో అంజన్నకు ప్రత్యేక
అలంకరణ పూజలు, హోమాలు
హంపీ విరుపాక్షేశ్వరాలయం
వద్ద కూడా భారీగా భక్తుల సందడి

అంజనాద్రికి పోటెత్తిన భక్తులు

అంజనాద్రికి పోటెత్తిన భక్తులు