
భార్య, బామ్మర్ది ఎదుటే వ్యక్తి బలవన్మరణం
హుబ్లీ: తన భార్య, బామ్మర్ది ఎదుటే గొంతు కోసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెళగావి తాలూకా ఒన్నిహాళ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. మల్లప్ప కటబుగోళ(34) తన గొంతును తానే కోసుకొని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి. శుక్రవారం ఇంట్లో ఉన్న బియ్యం అమ్మి మద్యం తాగి వచ్చిన భర్త గొడవకు దిగాడు. రాత్రంతా భార్య రేఖతో ఘర్షణ పడుతూ దాడి కూడా చేశాడు. దీంతో భార్య తన సోదరుడిని పిలిపించి భర్తకు బుద్ధి చెప్పించింది. ఈ క్రమంలో బామ్మర్ది మల్లికార్జున కర్రతో భయపెట్టినట్లు నటిస్తూ కొడవలి తీసుకొని చంపేస్తాను బావా అంటూ బెదిరించాడు. నీవు చనిపోతే అక్క బాగుంటుందని బామ్మర్ది అంటున్న క్షణంలోనే అదే కొడవలి లాక్కొని గొంతు కోసుకొని తీవ్రంగా గాయపడి మల్లప్ప మృతి చెందాడు. మల్లప్ప చనిపోగానే స్థలంలో ఉన్న బామ్మర్ది పరారయ్యాడు. ఘటన స్థలానికి మారిహాళ పోలీసులు వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు ప్రేరణ కల్గించినట్లు కేసు దాఖలు చేసుకొన్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుని కోసం గాలింపు చేపట్టారు.
రైలులో గోవా మద్యం జప్తు
హుబ్లీ: అమరావతి ఎక్స్‌ప్రెక్స్ రైల్లో గోవాకు చెందిన మద్యాన్ని తరలిస్తుండగా వారసులు లేని సదరు మద్యాన్ని రైల్వే పోలీసులు జప్తు చేశారు. రూ.3600 విలువ చేసే మద్యంతో నిండిన 30 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై హుబ్లీ రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కాగా మరో ఘటనలో స్థానిక పడదయ్యన అక్కలలో నిల్వ చేసిన పాలికె ఆధీనంలోని రూ.20 వేల విలువ చేసే 1000 కేజీల పాత కట్టడంలోని ఐరన్ హ్యాంగ్లర్ల పట్టీలు, రేకుల షీట్లు చోరీకి గురయ్యాయి. సంబంధిత అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కసబాపేటె పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
ఆగస్టు 3న స్టీల్ సిటీ రన్
బళ్లారిఅర్బన్: నగరంలో స్టీల్ సిటీ రన్–2025ను ఆగస్టు 3న చేపట్టామని, ఆసక్తి గల వారు పరుగులో పాల్గొనడానికి తమ పేర్లను నమోదు చేయించుకోవాలని కార్యక్రమ నిర్వహణ సమితి అధ్యక్షుడు డాక్టర్ సోమనాథ్ పేర్కొన్నారు. మీడియాతో ఆయన శనివారం మాట్లాడారు. గతంలో కూడా ఆరోగ్య, శారీరక పటిమ కోసం స్టీల్ సిటీ రన్ ఏర్పాటు చేశామన్నారు. గత మూడేళ్ల నుంచి ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొంటున్నందున సార్వజనిక కార్యక్రమంగా చేయాలన్న ఉద్దేశ్యంతో 3, 5, 10 కిలోమీటర్ల దూరం పరుగును ఏర్పాటు చేశామన్నారు. సంగనకల్లు సమీపంలోని విజ్‌డం ల్యాండ్ స్కూల్ వద్ద నుంచి పరుగును ప్రారంభిస్తామన్నారు. ముఖ్యంగా కార్యక్రమాన్ని అంతర్జాతీయ అథ్లెట్ సుధీష్ణ రెడ్డి ప్రారంభిస్తారన్నారు. జేఎస్‌డబ్ల్యూతో పాటు వివిధ సంస్థల సౌజన్యంతో నిర్వహించే ఈ పోటీల్లో పాల్గొనేందుకు వరుసగా రూ.500, రూ.400, రూ.350ల రుసుమును నిర్ణయించామన్నారు. అభ్యర్థులకు ఆరోగ్య పరీక్షలను నిర్వహించి టీషర్ట్, ఫలహారం అందిస్తారన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పోటీల్లో సుమారు 14 రాష్ట్రాల నుంచి 4 వేల మందికి పైగా జనం పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే 1000 మంది మహిళలు పేర్లు నమోదు చేసుకోవడం హర్షనీయం అన్నారు. ప్రశాంత్, రవిశంకర్, వినోద్‌జైన్, డాక్టర్ శశిధర్, డాక్టర్ సుందర్ తదితరులు
పాల్గొన్నారు.