
పేదలకు ఆరోగ్య పరీక్ష శిబిరం
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని తాయకనహళ్లి గ్రామంలోని శ్రీ కనక విద్యా కేంద్రంలో, తుమకూరు అక్షర ఐ ఫౌండేషన్, హొసపేటె నేత్ర లక్ష్మీ వైద్యాలయం, కూడ్లిగి తాలూకా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే దివంగత ఎన్‌టీ.బొమ్మణ్ణ జ్ఞాపకార్థం పేదలకు భారీ ఉచిత కంటి తనిఖీ, ఆరోగ్య పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యాధి రహిత జీవితాన్ని గడపడానికి నివారణ చర్యలు తీసుకోవడం ప్రధానమని అన్నారు. కొంతమందికి వ్యాధులు శరీరంలోకి ప్రవేశిస్తాయని తెలియదు. పరీక్ష ద్వారా వ్యాధులను గుర్తించవచ్చు. కనుక ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. 40 ఏళ్లుపైబడిన వారు ఈసీజీ చేయించుకోవాలి. విదేశీ నిపుణుల బృందం ప్రత్యేకంగా శిబిరంలో ఉన్నందున, గ్రామస్తులను తనిఖీ చేయించుకోవాలని ఆయన అభ్యర్థించారు.
ఈసారి సరిహద్దు గ్రామాలకు లబ్ధి కోసం..
తమ తండ్రి, మాజీ ఎమ్మెల్యే ఎన్.టి.బొమ్మణ్ణ జ్ఞాపకార్థం ఈ సారి సరిహద్దు గ్రామాలకు ప్రయోజనం చేకూర్చేలా తాయకనహళ్లి గ్రామంలో దీనిని ఏర్పాటు చేశారు. ప్రత్యేక కంటి పరీక్షతో పాటు అందరికీ ఉచిత అద్దాలు, మందులను అందజేశారు. గుండె సంబంధిత వ్యాధులకు ఈసీజీ, ఎకో, యాంజియోగ్రామ్, మహిళలు, పిల్లల వ్యాధులకు సలహా, డయాబెటిస్, బీపీ, ఉబ్బసం, అలెర్జీలు, పిత్తాశయం, మూత్రపిండాలు, ఎముకలు, వీపు, కడుపు నొప్పి, ఫైల్స్ వ్యాధులను తనిఖీ చేసి మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరంలో 2730 మంది సద్వినియోగం చేసుకున్నారు. ఉచిత కంటి శస్త్ర చికిత్స శిబిరంలో సుమారు 270 మందికి తనిఖీలు, మందులు అందించారు. 96 మంది ఈసీజీ చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీఎంసీ అధ్యక్షుడు కురిహట్టి బోసయ్య, ఉపాధ్యక్షుడు మడ్లకనహళ్లి కే.మహదేవప్ప, హుడెం గ్రామ పంచాయతీ సభ్యుడు కేఎన్ రాఘవేంద్ర, బోసు మల్లయ్య, రసూల్ సాబ్, బట్లర్ పాపన్న, గురు కనకవిద్యా సంస్థ కార్యదర్శి మంజన్న, నజీం సాబ్, ప్రత్యేకాధికారుల బృందం పాల్గొన్నారు. గ్రామ పెద్దలను ఎమ్మెల్యేలు బహుమతులు, సత్కారాలతో సత్కరించారు.
స్టెతస్కోప్ పట్టిన ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్
భారీగా తరలి వచ్చిన గ్రామీణ ప్రజలు