
సమస్యల సుడిలో ప్రభుత్వ కళాశాలలు
సాక్షి బళ్లారి: 10వ తరగతి అనంతరం పీయూసీ ప్రతి ఒక్క విద్యార్థికి కీలకమైన, భవిష్యత్తు విద్యాభ్యాసానికి కీలక ముందడుగు సాధించే ఒక బృహత్తరమైన ఘట్టం. అయితే పీయూసీని పాలకులు నిర్లక్ష్యం చేస్తుండటంతో విద్యార్థులకు శాపంగా మారింది. ప్రభుత్వ కళాశాలల్లో ఏటేటా విద్యాబోధన అంతంత మాత్రంగానే కొనసాగుతోంది. కళాశాలల్లో తగినంత మంది అధ్యాపకులను నియమించకపోవడంతో ప్రభుత్వ కళాశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఏటేటా గణనీయంగా తగ్గిపోతోంది. పీయూసీ(ఇంటర్మీడియట్) రెండేళ్లు పూర్తయిన తర్వాత నీట్, జేఈఈ, కేసెట్ తదితర పోటీ పరీక్షలకు విద్యార్థులు పోటీ పడాల్సి ఉంటుంది. ఇంజినీరింగ్, మెడికల్, ఇతర వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి సీట్లు సాధించాలంటే నేటి పోటీ ప్రపంచంలో అంత సులభమైన పని కాదు. విద్యార్థుల్లో సామర్థ్యం ఉన్నా కళాశాలల్లో తగినంత మంది అధ్యాపకులు, సంబంధిత మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు సుముఖత చూపడం లేదు. పేద విద్యార్థులు కూడా అష్టకష్టాలతో ప్రైవేటు కళాశాలలను ఆశ్రయించి వారి తల్లిదండ్రులకు ఆర్థిక సమస్యలు తెచ్చిపెడుతున్నారు.
వేధిస్తోన్న అధ్యాపకుల కొరత
ప్రభుత్వ కళాశాలల్లో బోధకుల కొరత, మౌళిక సదుపాయాలు లేమి వారి లక్ష్యాలను చేరుకునేందుకు వీలు కాదనే ప్రభుత్వ కళాశాలల్లో చేరడం లేదు. జిల్లాలో ఈ ఏడాది ప్రభుత్వ కళాశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయిందని అధికార గణంకాలు చెబుతున్నాయి. జిల్లాలో 21 ప్రభుత్వ కళాశాలలుండగా ఇందులో 126 మంది అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. 21 ప్రభుత్వ కళాశాలలకు గాను మూడు కాలేజీల్లో ఇప్పటి వరకు 50 మంది లోపు విద్యార్థులు మాత్రమే చేరారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 2025–26వ విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఏడు వేల మందిలో 50 మంది లోపు విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ కళాశాలల్లో చేరారు. చేరిన విద్యార్థులు కూడా అక్కడ మౌలిక సదుపాయాలు, లెక్చరర్ల కొరత చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులను చేర్పించి వారికి ఉచిత విద్యను అందించాలనే సంకల్పం పెట్టుకొన్నారే కానీ ఆ దిశగా విద్యార్థులకు తగిన విధంగా విద్యాబోధన చేయడానికి అధ్యాపకులను నియమించకపోవడంతో విద్యార్థులకు మెరుగైన విద్య అందని ద్రాక్షగా మారనుంది.
ఖాళీ పోస్టుల వివరాలివే..
జిల్లాలో 21 ప్రభుత్వ కళాశాలల్లో ఇంగ్లిష్ లెక్చరర్లు 20 మంది, హిస్టరీ 14 మంది, రాజనీతి శాస్త్రం 14 మంది, సామాజిక శాస్త్రం 14, కామర్స్ 7, సైన్స్ 10, కన్నడ 13 మంది, ఇలా జిల్లా వ్యాప్తంగా దాదాపు 126 మంది ఉపన్యాసకుల పోస్టులు ఆయా కళాశాలల్లో ఖాళీగా ఉన్నప్పటికీ విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో వేలాది మంది చేరారు. అక్కడ సదుపాయాలను కల్పించకపోవడంతో వారి ఉన్నత విద్యాభ్యాసంపై తీవ్ర పరిణామం చూపనుంది. ప్రతి ఏటా రాష్ట్ర వ్యాప్తంగా పీయూసీ ఫలితాల్లో 10వ స్థానం లోపు చోటు సంపాదించుకోవాలని తీవ్ర కసరత్తు చేస్తున్నప్పటికీ ప్రభుత్వ కళాశాలల్లో ఫలితాలు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. విద్యార్థులు వారి సొంత తెలివితేటలతో, సాంకేతికతను ఉపయోగించుకొని కొందరు విద్యార్థులు ఉత్తీర్ణతను సాధించడంతోపాటు పోటీ పరీక్షలకు కూడా ప్రైవేటుగా శిక్షణ పొంది పరీక్షలను రాసి ఉత్తీర్ణతను సాధిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు నీట్( మెడిసిన్), జేఈఈ, సీఈటీ, కేసెట్( ఇంజినీరింగ్, అగ్రికల్చర్, బీఎస్సీ, బీఏఎంఎస్, వెటర్నరీ) తదితర వృత్తి విద్యా కోర్సులకు వెళ్లేందుకు పీయూసీ తర్వాత పరీక్షలు రాయడానికి ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత సాధించి ఆ దిశగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ కళాశాలల్లో ఉన్నత విద్యాబోధన, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు.
పీయూ కళాశాలల్లో తగ్గుతున్న విద్యార్థుల ఉత్తీర్ణత శాతం
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో బోధన ఎన్నడో?
నీట్, ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్ల సాధనలో విఫలం
ప్రైవేటు కళాశాలల్లో చేరిక వైపే విద్యార్థుల మొగ్గు
ప్రైవేటు కాలేజీల్లో రూ.లక్షలాది మేర ఫీజుల మోత
పట్టించుకోని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు
జిల్లాలో 21 ప్రభుత్వ కాలేజీల్లో 126 పోస్టులు ఖాళీ

సమస్యల సుడిలో ప్రభుత్వ కళాశాలలు