
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
రాయచూరు రూరల్: నగర ప్రాంత విద్యార్థులు క్రీడల్లో రాణించి రాష్ట్ర స్థాయికి ఎదిగేందుకు పోటీ పడాలని నగరసభ ఉపాధ్యక్షుడు సాజిద్ సమీర్ పేర్కొన్నారు. శుక్రవారం మహాత్మగాంధీ క్రీడా మైదానంలో తాలూకా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. విద్యార్థులు విద్యాభ్యాసంతో పాటు క్రీడల్లో కూడా పాల్గొని ప్రతిభను ప్రదర్శించి పేరు గడించాలన్నారు.
ధార్వాడలో యువకుడు ఆత్మహత్య
హుబ్లీ: అనారోగ్యంతో బాధ పడుతున్న ఓ యువకుడు విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ధార్వాడ తాలూకా కబ్బెనూరులో చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన మక్తుమ్‌సాబ్ (26) ఆత్మహత్య చేసుకున్న యువకుడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ యువకుడు గురువారం రాత్రి తమ పొలంలో విషం తాగాడు. తక్షణమే కుటుంబ సభ్యులు అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయినట్లు ధార్వాడ గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మరో ఘటనలో గుండెపోటుతో జిల్లాలోని నవలగుంద తాలూకా హేమనూరు గ్రామానికి చెందిన హనుమంతప్ప హుగార(48) మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, అపార సంఖ్యలో బంధువులు ఉన్నారు.
గుండెపోటుతో వ్యాయామ ఉపాధ్యాయుడు మృతి
హొసపేటె: కొప్పళ జిల్లా గంగావతి తాలూకాలోని బహుదూర్ బండి గ్రామంలో గుండెపోటుతో వ్యాయామ ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన జరిగింది. శాంతవీరస్వామి గంగాధర్(57) అనే వ్యక్తి హిరేబెణకల్ గ్రామ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా, యోగా ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుతున్నందున ఉదయం గంగాధర్ ఆస్పత్రిలో చేరాడు. అయితే చికిత్స పొందుతూ అతను మరణించాడు. దీంతో కొప్పళ జిల్లాలో ఇప్పటి వరకు ఐదుగురు గుండెపోటుతో మరణించినట్లయింది.
20న బంజారా సాహిత్య పరిషత్ ప్రారంభం
హొసపేటె: బంజారా సాహిత్య పరిషత్ విజయనగర జిల్లా శాఖ ప్రారంభోత్సవం, పదాధికారుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈనెల 20న ఉదయం 10 గంటలకు నగరంలోని అంబేడ్కర్ భవన్‌లో నిర్వహించనున్నారు. మాజీ మంత్రి పీటీ పరమేశ్వర నాయక్ పరిషత్ శాఖను లాంఛనంగా ప్రారంభిస్తారు. శివప్రకాష్ మహారాజ తిప్పేరుద్ర స్వామీజీ హాజరవుతారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే హెచ్‌ఆర్ గవియప్ప అధ్యక్షత వహిస్తారు. ఎమ్మెల్యేలు నేమిరాజ్ నాయక్, కృష్ణనాయక్, కేఎంఎఫ్ మాజీ అధ్యక్షుడు భీమా నాయక్, డీహెచ్‌ఓ డాక్టర్ ఎల్‌ఆర్.శంకర్ నాయక్, కూడ్లిగి డీఎస్పీ మల్లేష్ దొడ్డమని, హగరిబొమ్మనహళ్లి సీఐ వికాస్ లమాణి, పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ జాధవ్, ఇతర ప్రముఖులు పాల్గొంటారు. సరిగమప ఫేమ్ రమేష్ లమాణి సంగీత కార్యక్రమం ఉంటుందని పరిషత్ జిల్లా అధ్యక్షుడు అలోక్ నాయక్ తెలిపారు.
దుండగుడిని ఉరి తీయాలి
బళ్లారి అర్బన్: ఉపాధి కోసం కొప్పళ జిల్లా హర్లాపుర గ్రామం నుంచి బెంగళూరుకు కట్టడ కార్మికురాలిగా పనికి వెళ్లిన రేణుకమ్మ, నాగప్ప దంపతుల కుమార్తె అరుణకుమారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని తక్షణమే ఉరి శిక్ష విధించాలని బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం తగిన పరిహారం చెల్లించాలి. ఆ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చి ఆదుకోవాలని అలెమారి, అరె అలెమారి సంఘం జిల్లాధ్యక్షుడు తిమ్మణ్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో డీసీ కార్యాలయంలో ఆందోళన చేపట్టి అనంతరం జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు. కట్టడ కార్మికురాలిగా బతకడానికి వచ్చిన అమాయకురాలైన అరుణ కుమారిపై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన క్రూరుడైన నిందితుడిని ఏ మాత్రం కరుణించకుండా ఉరి శిక్ష వేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. కార్మిక పరిషత్ అధ్యక్షుడు దేవ, ఆ సంఘం జిల్లా, తాలూకా పదాధికారులు పాల్గొన్నారు.
ఆ కేసును విరమించుకోండి
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా సిరివార తాలూకా కరవే అధ్యక్షుడిపై బలవంతంగా పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని కరవే జిల్లా అధ్యక్షుడు వీరేష్ వీర డిమాండ్ చేశారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు వీరా మాట్లాడుతూ వారం రోజుల క్రితం తాలూకా అధ్యక్షుడు రాఘవేంద్ర, ఖాజనగౌడలపై పెట్టిన కేసు అసత్యంతో కూడినదని, దానిని విచారించి కేసును ఉపసంహరించుకోవాలని కోరుతూ ఎస్పీ పుట్టమాదయ్యకు వినతిపత్రాన్ని సమర్పించారు.

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి