
ఇన్‌చార్జి మంత్రిపై ఎమ్మెల్యేల చిందులు
రాయచూరు రూరల్: ప్రభుత్వం ఏర్పాటై ఏడున్నరేళ్లు గడుస్తున్నా జిల్లాలో అభివృద్ధి పనుల విషయంలో మంత్రులు నిర్లక్ష్యం చేయడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా పంచాయతీ సభాంగణంలో జరిగిన కేడీపీ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్‌పై ఎమ్మెల్యేలు బసవనగౌడ దద్దల్, బసవనగౌడ తుర్విహాళ్, ఎమ్మెల్సీ వసంత్‌కుమార్ చిందులు తొక్కారు. జిల్లాలో అభివృద్ధి పనుల విషయంలో 6 నెలలకు ఒకసారి సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తే అభివృద్ధి పనులపై ఆలోచన చేయడం సాధ్యమవుతుందా? అని మంత్రిని ప్రశ్నించారు. మరో వైపు దేవదుర్గ శాసన సభ్యురాలు కరియమ్మ నాయక్ మాట్లాడుతూ రాయచూరు నుంచి దేవదుర్గ మార్గంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించిన టోల్‌గేట్‌ను తొలగించాలని కోరుతూ అరగంట సేపు బైఠాయించారు. బెంగళూరు ప్రాంతంలో శాసన సభ్యుడు దర్శన్ పుట్టణ్ణయ్య టోల్‌ను తొలగించాలని లేఖ సమర్పించిన వెంటనే తొలగించిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు.
ఎరువుల కొరత లేకుండా చూడండి
జిల్లాలో ఎరువుల కొరత నెలకొనకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రామాణికతతో విధులు నిర్వహించాలని, శాసన సభ్యుల గౌరవానికి భంగం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అక్రమంగా ఇసుక, బియ్యం రవాణా, ఎరువుల విక్రయం, నకిలీ విత్తనాల సరఫరా, జూదం, మట్కా వంటి అక్రమాలపై జిల్లా స్థాయి అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు శరణేగౌడ బయ్యాపుర, బసవనగౌడ బాదర్లి, జిల్లాధికారి నితీష్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్, ఎస్పీ పుట్టమాదయ్య, డీహెచ్‌ఓ సురేంద్రబాబు, విద్యాశాఖ అధికారి బిరాదార్, వ్యవసాయ శాఖ అధికారి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిపై కేడీపీ సమావేశంలో రసాభాస
టోల్‌గేట్‌ను తొలగించాలని బైఠాయింపు

ఇన్‌చార్జి మంత్రిపై ఎమ్మెల్యేల చిందులు

ఇన్‌చార్జి మంత్రిపై ఎమ్మెల్యేల చిందులు