
రేపు రక్తదాన శిబిరం
బళ్లారిటౌన్: శ్రీరామరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 20న సంగనకల్లు రోడ్డులోని కేఆర్‌ఎస్ ఫంక్షన్ హాల్‌లో స్వామి వివేకానంద రక్త కేంద్రం సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఉదయం 8 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఏర్పాటు చేసినట్లు ఫౌండేషన్ అధ్యక్షుడు రాజు తెలిపారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ ఫౌండేషన్ నుంచి ప్రస్తుతం మూడోసారి ప్రతి ఏటా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈసారి ప్రత్యేకంగా శిబిరంలో రక్తదానం చేసిన వారికి హెల్మెట్ కూడా అందజేస్తున్నట్లు తెలిపారు. తమ సంస్థ గతంలో కోవిడ్ సమయంలో రేషన్ కిట్లను అందజేయడంతో పాటు ప్రతి ఏటా పేద విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, బ్యాగ్‌లను అందజేసిందని గుర్తు చేశారు. అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అన్నారు. రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న సాటి వ్యక్తిని కాపాడినట్లవుతుందన్నారు.