
గ్రేటర్ బెంగళూరులో పంచ పాలికెలు
బనశంకరి: గ్రేటర్ బెంగళూరును 5 మహానగర పాలికెలుగా విభజన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 3 పాలికెలా, 7 పాలికెలా? అనే సస్పెన్స్‌ను ముగిస్తూ మంత్రిమండలి భేటీలో 5కు ఖరారు చేసింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధ్యక్షతన గురువారం కేబినెట్ సమావేశం నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట దుర్ఘటనలో ఆర్‌సీబీ దే బాధ్యత అని తేల్చి క్రిమినల్ కేసు నమోదు చేయనున్నారు. సమావేశం తరువాత వివరాలను న్యాయశాఖమంత్రి హెచ్‌కే.పాటిల్ మీడియాకు వివరించారు.
● రూ. 24 కోట్లతో రాయచూరు తాలూకాలో నూతన జౌళి పార్కు ఏర్పాటు.
● రాష్ట్రంలో అణు విద్యుత్ స్థావరం ఏర్పాటుకు ఆమోదం. ఇందుకు ఎన్‌టీపీసీ గుర్తించిన స్దలాల పరిశీలనకు నిర్ణయం. రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు సాధ్యమో అధ్యయనం చేస్తారు. కొప్పళ, రాయచూరు, విజయపుర సహా మిగిలిన స్థలాలను పరిశీలిస్తారు.
● గ్రేటర్ బెంగళూరును 5 పాలికెలుగా చేయాలని తీర్మానం. ప్రస్తుతం బీబీఎంపీ ఒక్కటే ఉంది.
● ఆయుష్‌శాఖ ఆయుర్వేద, సిద్ద, యునాని ఔషధాల సురక్షిత ల్యాబ్‌ను ఆహార సురక్షత శాఖలో విలీనం
● ప్రభుత్వ ప్రథమ డిగ్రీ కాలేజీల్లో మిగిలిపోయిన ఉర్దూ బాషా అసిస్టెంట్ అధ్యాపకుల పోస్టులను జనరల్ అభ్యర్థులతో భర్తీ
● రూ. 2.20 కోట్లతో న్యాయ విజ్ఞాన ప్రయోగాలయాల కోసం ఫోరెన్సిక్ వాహనాల కొనుగోలు
● హావేరి జిల్లా హానగల్ తాలూకా యళవట్టి గ్రామంలో 28 ఎకరాల ఆహార ఉత్పత్తుల తయారీకి ఫుడ్‌పార్క్ ఏర్పాటు
● బెంగళూరు నగరంలో మురుగునీటిని శుద్ధి చేసి కోలారు జిల్లా, చిక్కబళ్లాపుర జిల్లాల్లో 126 చెరువులను నింపడానికి 5 ఏళ్లు నిర్వహణ పనులకు రూ.128 కోట్ల మంజూరు
● మైనారిటీ వసతి పాఠశాలలు, కాలేజీల నిర్మాణ పనులకు రూ.264 కోట్లు మంజూరు
● బెళగావిలో కిత్తూరు కోటలో రూ.30 కోట్ల తో థీమ్ పార్క్ ఏర్పాటు
● బెంగళూరు గ్రామాంతర జిల్లా , దొడ్డబళ్లాపుర తాలూకా వీరభద్రనపాళ్య గ్రామ సర్వేనెంబరు 66లో 15 గుంటల భూమిని కాంగ్రెస్ ఆఫీసుకు కేటాయింపు
● గ్రామ పంచాయతీలలో 1,530 టెలిమెట్రిక్ వర్ష మాపన పరికరాలు రూ.19.89 కోట్లతో కొత్తవి ఏర్పాటు
● రూ.166 కోట్ల అంచనాతో బాదామి, ఐహోళె , హంపీ, పట్టదకల్లు, బీజాపుర తో కూడిన ఉత్తర కర్ణాటక పర్యాటక సర్కిల్ అభివృద్ధి.
● గ్రేటర్ బెంగళూరు పరిధిలో ఏఖాతా, బీ ఖాతాలు పంపిణీ. అక్రమ కట్టడాల నిర్మాణం, లేఔట్లకు చెక్.
మంత్రిమండలిలో నిర్ణయం
త్వరలోనే బీబీఎంపీ విభజన!
జౌళి పార్కు, అణు విద్యుత్ కేంద్రం

గ్రేటర్ బెంగళూరులో పంచ పాలికెలు