
గ్యారేజీలో అగ్నిప్రమాదం.. అపార నష్టం
హుబ్లీ: జిల్లాలోని తాలూకా కేంద్రమైన కలఘటిగిలోని ఓ గ్యారేజీలో ఆకస్మికంగా నిప్పు రాజుకోవడంతో అక్కడ ఉన్న వస్తువులు పూర్తిగా బుగ్గిపాలైన ఘటన నాయక్ పెట్రోల్ బంక్‌లో చోటు చేసుకుంది. శ్రీవీరభద్రేశ్వర టూవీలర్ గ్యారేజీలో ఈ ప్రమాదం వాటిల్లింది. రిపేరీకి వచ్చిన బైక్‌లు, ఇతర వస్తువులు బూడిద అయ్యాయి. ఘటనలో రూ.లక్షలాది మేర నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయారు. సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు.
కత్తిపోటుకు గురైన యువకుడు మృతి
హుబ్లీ: ఇటీవల ధార్వాడ కంటి గల్లిలో పట్టపగలు కత్తిపోటుకు గురై తీవ్రంగా గాయపడిన రాఘవేంద్ర గాయక్‌వాడ కేఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మల్లిక్ అనే యువకుడు రాఘవేంద్రపై చాకుతో దాడి చేసి పొడిచిన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడిన రాఘవేంద్ర సదరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే కత్తిపోటు బలంగా ఉండడంతో చికిత్స ఫలించక రాఘవేంద్ర మృతి చెందినట్లు ధార్వాడ గ్రామీణ పోలీసులు తెలిపారు.