
హడలెత్తించిన బాంబు బెదిరింపులు
బనశంకరి: పాఠశాలల్లో బాంబులు పెట్టినట్లు ఈమెయిల్స్ రావడంతో బెంగళూరులోని పలు పాఠశాలల యాజమాన్యాలు వణికిపోయాయి. పిల్లలందరినీ హుటాహుటిన బయటకు పంపగా అప్పటికే విషయం బహిరంగం కావడంతో తల్లిదండ్రులు ఉరుకుల పరుగులతో పాఠశాలల వద్దకు చేరుకొని తమ పిల్లలను అక్కున చేర్చుకున్నారు. శుక్రవారం ఉదయం పాఠశాలలు తెరవగానే కంప్యూటర్లలో ఈ–మెయిల్స్ దర్శనమిచ్చాయి. వాటిని తెరిచి చూడగా నగరంలోని కెంగేరి, ఎంఎస్.థోని గ్లోబల్ స్కూల్, రాజరాజేశ్వరి నగర, భారతీనగర, కబ్బన్‌పార్కు, చామరాజపేటె, హెణ్ణూరు, శ్రీరాంపుర, రామమూర్తినగరతో పాటు 40కి పైగా ప్రైవేటు పాఠశాలల్లోని తరగతి గదుల్లో ట్రినిట్రూటూలైన్స్ అనే పేలుడు వస్తువులు పెట్టామని, ఏ క్షణంలోనైనా పేలిపోవచ్చని కనిపించింది. భయభ్రాంతులకు గురైన ఉపాధ్యాయులు పిల్లలను బయటకు పంపించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాంబు స్క్వాడ్‌తో వెళ్లిన సిబ్బంది అన్ని పాఠశాలల్లో క్షుణ్ణంగా తనిఖీ చేయగా ఎలాంటి బాంబు ఆచూకీ లభించకపోవడంతో ఉత్తుత్తి బాంబు బెదిరింపు అని తేల్చారు.
ఉదయమే మెయిల్ వచ్చింది
శుక్రవారం ఉదయం 7.45 గంటల సమయంలో మెయిల్ వచ్చింది. పాఠశాలలో పరీక్ష జరుగుతోంది. తక్షణం పోలీసులకు సమాచారం అందించాం, పోలీసులు వచ్చి తనిఖీ చేయగా ఎలాంటి పేలుడు వస్తువులు కనబడలేదు. ఎవరో మానసికంగా ఇబ్బందికి గురైన వ్యక్తి మెయిల్ చేశారు. ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయని సెయింట్ జర్మన్ అకాడమి స్కూల్ ప్రిన్సిపాల్ మోనికా ఆంటోని తెలిపారు.
మీ అందరినీ ఈ లోకం నుంచి పంపించేస్తాం
మీకు నమస్కారం, పేలుడు పదార్దాలను బ్లాక్ ప్లాస్టిక్ సంచిలో ఉంచి తరగతి గదుల్లో ఉంచాం. మీ అందరినీ ఈ లోకం నుంచి పైకి పంపిస్తామని, ఎవరూ బతకరు, ఈ సమాచారం నేను చూసి సంతోషంతో నవ్వుతా, మీరందరూ కష్టాలు అనుభవించాలి, ఈ సమాచారం బయట పడిన అనంతరం నేను గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకుంటా అని ఈ–మెయిల్‌లో ఉంది. తనకు ఎవరూ సహాయం చేయలేదు, మానసిక వైద్యులు, మనో శాస్త్రవేత్తలు నాపై ప్రేమ చూపించలేదు అని పేర్కొన్నారు. మెయిల్ డొమైన్ బ్రిటిష్ ఇండియన్ ఓషియన్ టెరిటరీకి చెందిన వారు కాగా దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.
2023లో కూడా ఈ–మెయిల్ బెదిరింపు
2023 డిసెంబరులో బెంగళూరు నగరంలోని 15 ప్రైవేటు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. పోలీసుల తనిఖీల్లో ఉత్తుత్తి బాంబు బెదిరింపు అని వెలుగు చూసింది. 2022 ఏప్రిల్‌లో కూడా నగరంలోని 10కి పైగా ప్రైవేటు స్కూల్స్‌కు ఈ–మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు.
బెంగళూరులో 40 ప్రైవేటు స్కూళ్లకు ఈ–మెయిల్స్
ఉరుకులు పరుగులు పెట్టిన విద్యార్థుల తల్లిదండ్రులు, పోలీసులు
ఉత్తుత్తి బెదిరింపుగా తేల్చిన
బాంబు నిర్వీర్యదళం

హడలెత్తించిన బాంబు బెదిరింపులు