
ప్రజల రక్షణకే ఇంటింటికీ పోలీస్
● హోం మంత్రి పరమేశ్వర్
శివాజీనగర: ప్రజలు, పోలీసుల మధ్య సత్సంబంధాలు నెలకొల్పి వారి సమస్యలు ఆలకించేందుకు ప్రభుత్వం ఇంటింటికీ పోలీసు కార్యక్రమాన్ని రూపొందించిందని హోం మంత్రి డాక్టర్ జీ.పరమేశ్వర్ అన్నారు. బెంగళూరులోని గోవిందరాజనగర ఎంసీ లేఔట్‌లో శుక్రవారం ఆయన ఇంటింటికీ పోలీస్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక ఇంటిని సందర్శించి వారి సమస్యలు ఆలకించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. పోలీసులు ప్రతి ఇంటికీ వెళ్లి ఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, కొత్త వ్యక్తుల సంచారంపై ఆరా తీస్తారన్నారు. గృహ హింసపై అర్జీలు స్వీకరిస్తారన్నారు. ఇంటిలో ఎవరున్నారు, కొత్తగా వచ్చారా, అద్దెకు ఉన్నారా, వారి ఉద్యోగం తదితర సమాచారం సేకరించి బెంగళూరు డేటా బ్యాంక్‌లో పొందుపరుస్తామన్నారు. పోలీసులు వచ్చినపుడు ప్రజలు తమ కష్టసుఖాలు చెప్పవచ్చన్నారు. ఈ కార్యక్రమం దేశంలోనే ప్రప్రథమన్నారు. నేరాలను ముందుగానే కనిపెట్టడానికి ఈ కార్యక్రమం దోహద పడుతుందన్నారు. ‘ఇంటింటికీ పోలీస్’ మీ రక్షకులు, మీ ఇంటి తలుపు వద్దకు! అని బెంగళూరు ఆగ్నేయ డీసీపీ తన ఎక్స్ సందేశంలో తెలిపారు. సమాజంలో నిర్భయమైన వాతావరణాన్ని సృష్టించటంతో పాటు భద్రత, సురక్షతను కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. ఎమ్మెల్యే ప్రియాకృష్ణ, డీజీ, ఐజీపీ డాక్టర్ ఎం.ఏ.సలీం, నగర పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు.
వికాస్‌కుమార్ కేసు విచారణ వాయిదా
బనశంకరి: చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృత్యవాతపడిన వ్యవహారంలో ఐపీఎస్ అధికారి, అదనపు పోలీస్‌కమిషనర్ వికాస్‌కుమార్‌పై విధించిన సస్పెన్షన్‌ను క్యాట్ కొట్టి వేయడాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం న్యాయమూర్తులు జస్టిస్ ఎస్‌జీ.పండిత్, జస్టిస్ టీఎం సదాఫ్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. వికాస్‌కుమార్ తరపున సీనియర్ న్యాయవాది ద్యానచిన్నప్ప వాదనలు వినిపించారు. పోలీసులు ఆర్‌సీబీ సేవకులుగా వ్యవహరించారనే వాదన దురదృష్టకరమన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా పోలీసులను సస్పెండ్‌చేశారన్నారు. భద్రత కల్పించిన పోలీసులను దూషిస్తున్నారన్నారు. దర్యాప్తు నివేదిక రాకముందే సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని వాదనలు వినిపించారు. వాదప్రతివాదనలు ఆలకించిన ధర్మాసనం ఈ కేసును ఈనెల 21కి వాయిదా వేసింది.
గొంతుకు వేల్ చుట్టుకొని బాలిక మృతి
యశవంతపుర: చుడీదార్ వేల్ గొంతుకు చుట్టుకొని బాలిక మృతి చెందిన ఘటన ఉత్తరకన్నడ జిల్లా కార్వార జిల్లా భట్కళలో చోటు చేసుకుంది. కార్వార జిల్లా వ్యాప్తంగా భారీ వానలు పడుతున్న కారణంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఇంటివద్దనే ఉన్న తెర్నమక్కి సబ్బత్తికి చెందిన ప్రణీత జగన్నాథ్ నాయక్(12) ఊయల ఊగుతుండగా చుడీదార్ వేల్ గొంతుకు బిగుసుకొని మృతి చెందింది. మురుడేశ్వర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

ప్రజల రక్షణకే ఇంటింటికీ పోలీస్