
దాతలు ఇచ్చిన రక్తంలో హెచ్‌ఐవీ
రక్తదానం చేయడానికి ఎవరు అర్హులు?
శిబిరంలో రక్తదానం చేస్తున్న దృశ్యం (ఫైల్)
బనశంకరి: ప్రాణాధారమైన రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. వ్యక్తుల నుంచి సేకరించిన రక్తాన్నే ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నవారికి అందజేయడం ఒక్కటే మార్గం. ఈక్రమంలో రక్తం కొరత ఏర్పడుతుండటంతో రక్తదాన ఆవశ్యకతపై ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. స్వచ్ఛంద సంస్థలు కూడా శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలనుంచి రక్తాన్ని సేకరిస్తున్నారు. అయితే రక్తదాన రక్తదానం చేయడానికి వచ్చిన వారిలో హెచ్‌ఐవీ, హెపటైటిస్, బీపీ, సిఫిలిస్, మలేరియా వైరస్ వెలుగు చూడటంతో సేకరించిన రక్తం వ్యర్థమౌతోంది.
పరీక్ష చేయకుండా రక్త సేకరణ
రాష్ట్రంలో మొత్తం 230 రక్తనిధి కేంద్రాలు ఉన్నాయి. వీటితో పాటు 43 ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్‌లు, 66 చారిటబుల్, 108 ప్రైవేటు ఆసుపత్రులతో కూడిన బ్లడ్ బ్యాంకులు, 5 స్వతంత్ర బ్లడ్‌బ్యాంకులు, 8 ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. రక్తనిధి కేంద్రాలు సాధారణంగా కాలేజీ, ఐటీ, బీటీ కంపెనీలు, రాజకీయ నేతలు, నటీనటుల జన్మదిన వేడుకల కార్యక్రమాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాయి. రోడ్ల పక్కన వాహనాలు నిలిపి రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారు. కానీ రక్తదాన శిబిరాల్లో దాతలకు ఆరోగ్య పరీక్షలు చేయకుండా రక్తం సేకరిస్తున్నారు. అనంతరం రక్తదాన శిబిరాల్లో సేకరించిన రక్తాన్ని బ్లడ్ బ్యాంకుల్లోని ల్యాబొరేటరీల్లో పరీక్షించే సమయంలో హెచ్‌ఐవీ, హెపటైటిస్, బీ.పీ, సిఫిలిస్, మలేరియాతో పాటు ఇతర అనారోగ్య వైరస్‌లతో బాధపడే వ్యక్తులు రక్తదానం చేసినట్లు బహిర్గతమవుతోంది. అలాంటి రక్తాన్ని డిస్‌కార్డ్ చేయాల్సి వస్తోంది.
ప్రతి 10 మంది దాతల్లో ఒకరిలో హెచ్‌ఐవీ వైరస్
10 మంది రక్తదానం చేసిన దాతల్లో ఒకరిలో హెచ్‌ఐవీ వైరస్ వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర రక్త విభాగం తెలిపిన వివరాల ప్రకారం 2024–25లో 44,776 యూనిట్లు, 2023–24లో 37,906 యూనిట్లు, 2022–23లో 43,857 యూనిట్ల రక్తాన్ని డిస్‌కార్డ్ చేశారు. 2023తో పోలిస్తే 2024లో అత్యధికంగా రక్తాన్ని డిస్‌కార్డ్ చేశారు.
రక్తం సేకరణ ఏవిధంగా చేస్తారంటే...
ఏ, బీ, ఏబీ, ఓ పాజిటివ్, నెగిటివ్‌తో పాటు 8 రకాల బ్లడ్ గ్రూపులు ఉన్నాయి. మూడునెలలకు ఒకసారి పురుషులు, 4 నెలలకు ఒకసారి మహిళలు రక్తదానం చేయవచ్చు. దాతల నుంచి రక్తం సేకరించి దానిని సెంట్రిఫికేషన్ చేస్తే కింది భాగంలో ఎర్ర రక్తకణాలు, మధ్యలో తెల్లరక్త కణాలుగా మారతాయి. ఆ రక్తాన్ని సురక్షిత బ్యాగుల్లో సేకరించి, ప్లేట్‌లెట్స్ కణాలను 24 డిగ్రీలు, ప్లాస్మా కణాన్ని మైనస్ 60 డిగ్రీల వాతావరణంలో సేకరిస్తారు. రోగికి ఆవశ్యకత ఉంటే ఆ రక్తాన్ని అందిస్తారు. హిమోగ్లోబిన్ అంశం తక్కువగా ఉన్న రోగులకు ప్లేట్‌లేట్స్ అందిస్తారు.
రక్తదానం చేయడానికి ఎవరు అనర్హులు?
అనారోగ్యం బారిన పడిన వ్యక్తులు, నియమితంగా ఔషధాలు వాడేవారు, అంటురోగాలు కలిగిన వ్యక్తులు, హెచ్‌ఐవీ, ఎయిడ్స్ రోగులు, హృద్రోగులు, క్షయరోగులు, హెపటైటీస్ బీ, రక్తహీనత, అపౌష్టికత లోపం ఉన్న వ్యక్తులు, గర్భిణులు, మధుమేహం నియంత్రణలో లేని వ్యక్తులు, డ్రగ్స్ బానిసలు, కిడ్నీతో పాటు ఇతర అవయవాలు ఇబ్బంది, వివిధ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులు రక్తదానం చేయరాదు. శస్త్రచికిత్సకు గురైన వ్యక్తులు, రేబీస్ టీకా, ఒంటిపై ట్యాటూ వేసుకున్న వ్యక్తులు 6 నెలల పాటు రక్తదానం చేయరాదు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి పునర్జన్మ ఇచ్చే మహత్కార్యమైన రక్తదానం కోసం ఎంతో మంది స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. అయితే తెలిసో తెలియకో వ్యాధిగ్రస్తులు ఇస్తున్న రక్తంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి
ప్రాణాధారంలో బయట పడిన
ప్రాణాంతక వైరస్
ల్యాబొరేటరీలో పరీక్ష సమయంలో వైరస్ ఆచూకీ లభ్యం
2024–25లో సేకరించిన
44,776 యూనిట్ల రక్తం వ్యర్థం
18 నుంచి 65 ఏళ్లలోపు వయసున్న ఆరోగ్యవంతమైన, దేహం బరువు కనీసం 45 కిలోలు కలిగిన వారు అర్హులు. వీరు 350 ఎంఎల్ రక్తం దానం చేయవచ్చు. 55 కిలోల కంటే అధిక బరువు కలిగిన వ్యక్తులు 450 ఎంఎల్ రక్తదానం చేయవచ్చు. దాతలకు హిమోగ్లోబిన్ హెచ్‌బీ ప్రమాణం కనిష్టం 12.5 శాతం ఉండాలి.
ప్రైవేటు బ్లడ్‌బ్యాంకులో అధిక డబ్బు వసూలు
చాలా వరకు రక్తనిధి కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరకు యూనిట్ రక్తం విక్రయించడం లేదు. ఒక యూనిట్‌కు కనీసం రూ.1000 నుంచి గరిష్టంగా రూ.1,400 నుంచి రూ.1,550 వరకు విక్రయధర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ప్రైవేటు ఆసుపత్రులువారు అధిక ధర నిర్ణయిస్తున్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞాన యంత్రాలు కారణం అని తెలిపి అధిక ధర విధిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. కొన్ని జిల్లాల్లో బ్లడ్ బ్యాంకులు ఇష్టానుసారం అడ్వాన్స్‌గా డబ్బు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు అందాయి.

దాతలు ఇచ్చిన రక్తంలో హెచ్‌ఐవీ